గతేడాది సరిగ్గా ఇదే సమయానికి మనదేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టించింది. కొంత కాలంగా కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. తాజాగా మరోసారి కరోనా కరోనా కేసులు వెలుగు చూస్తుండటం ఆందోళన కలిగిస్తుంది. అయితే ఇప్పుడు అందరినీ తొలుస్తున్న సందేహం ఒక్కటే. వేసవి మొదలవడంతో వాతావరణంలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఎక్కడ చూసినా ప్రజలు జలుబు, జ్వరం లాంటి లక్షణాలతో కనిపిస్తున్నారు.
అయితే అందులో ఏది కరోనా ఏది సాధారణ ఫ్లూ అనే విషయం తెలియక ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. నిజానికి ఇలాంటి లక్షణాలతో ఆసుపత్రికి వెళ్ళేవారిలో కరోనా వైరస్ వెలుగుచూస్తోంది. ఈ నేపథ్యంలో సాధారణ లక్షణాలకు కరోనా లక్షణాలకు ఉన్న తేడా ఏమిటో తెలుసుకుందాం..
కరోనా ఇన్ఫెక్షన్ సోకిన వారిలో దగ్గు, జ్వరం, ఆయాసం లాంటివి ఎక్కువగా కనిపించే లక్షణాలు. వైరస్ సోకిన వారిలో మొదట జ్వరం, దగ్గుతో మొదలై నిమోనియా బారిన పడుతుంటారు. వీరిలో ఆయాసం కూడా ఉంటుంది. మాట్లాడేటప్పుడు, పని చేస్తున్నప్పుడు ఆయాసంగా అనిపిస్తుంటే అనుమానించాలి. మీకు వచ్చింది సాధారణ జలుబే అయితే ముక్కు దిబ్బడ, ముక్కు కారడం మాత్రమే ఉంటాయి.
దగ్గు, ఆయాసం ఉండదు. ఒక వేళ జలుబు తో పాటుగా జ్వరం, ఒళ్ళు నొప్పులు ఉంటె అది ఫ్లూ అయ్యి ఉండవచ్చు. కొన్ని సార్లు మెల్లగా దగ్గు మొదలవుతుంది. కరోనా సోకితే సాధారణంగా 2, 5, 14 తేదీలలో లక్షణాలు బయటకు కనిపిస్తాయి. సాధారణ జ్వరం అయితే రెండు మూడు రోజుల్లో లక్షణాలన్నీ వాటంతటవే మాయమైపోతాయి.
అయితే మీరు కాంటాక్ట్ అయిన వ్యక్తులకు ఎవరికైనా వైరస్ సోకి.. మీకు కూడా అవే లక్షణాలు ఉంటె మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పరీక్షలు చేయించుకోవాలి. ఇక సాధారణ లక్షణాలు ఉన్నవారు రెస్ట్ తీసుకుంటూ కుటుంబసభ్యులకు దూరంగా గడపడం లాంటివి చేయాలి.