దేశంలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతంగా జరగడానికి గానూ మన కేంద్ర ప్రభుత్వం విదేశీ వ్యాక్సిన్లకు అనుమతి ఇస్తోంది. ఇందులో భాగంగా జాన్సన్ ఆండ్ జాన్సన్ తయారుచేసిన కరోనా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి ఆమోదం తెలిపింది ప్రభుత్వం. ఈ నిర్ణయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు.
అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ జాన్సన్ ఆండ్ జాన్సన్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ఇప్పటివరకు ప్రపంచంలో అందుబాటులోకి వచ్చిన మొదటి మరియు ఏకైక సింగిల్ డోస్ కరోనా వ్యాక్సిన్ ఇది. ఈ వ్యాక్సిన్ ఇప్పటికే అమెరికా సహా పలు యూరోప్ దేశాల్లో వినియోగంలో ఉంది. సింగిల్ డోస్ వ్యాక్సిన్ కావడం వల్ల వేగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను జరపడానికి జాన్సన్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుంది.
తమ వ్యాక్సిన్ ట్రయల్స్‌కు సంబంధించిన డేటాను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీజీసీఐ)కు సమర్పించిన జాన్సన్ సంస్థ భారత్‌లో తమ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేసుకుంది. మన దేశంలో ఏ వ్యాక్సిన్‌కైనా, ఏ ఔషదానికైనా అనుమతి ఇవ్వాల్సింది డీజీసీఐనే. జాన్సన్ సమర్పించిన డేటాను పూర్తిగా పరిశీలించిన అనంతరం భారత్‌లో అత్యవసర వినియోగానికి జాన్సన్ వ్యాక్సిన్‌కు డీజీసీఐ అనుమతి ఇచ్చింది.
తమ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో మంచి ఫలితాలు వచ్చాయని జాన్సన్ సంస్థ ప్రకటించింది. 85 శాతం సామర్థ్యంతో తమ వ్యాక్సిన్ పని చేస్తున్నట్లు వెల్లడించింది. వ్యాక్సిన్ వేసుకున్న 28 రోజుల తర్వాత శరీరంలో కరోనా యాంటీబాడీలు ఉత్పత్తి అవుతాయని, ఇవి వైరస్ నుంచి రక్షణ కల్పిస్తాయని జాన్సన్ సంస్థ వెల్లడించింది. కరోనా కారణంగా తీవ్ర అనారోగ్యం బారిన పడే పరిస్థితిని, ప్రాణాలకు ముప్పు కలగకుండా తమ వ్యాక్సిన్ రక్షిస్తుందని జాన్సన్ సంస్థ చెప్పింది. జాన్సన్ సంస్థకు అనుమతి రావడంతో ఇప్పటివరకు మన దేశంలో వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ల సంఖ్య ఐదుకు చేరింది.