తెలంగాణ ప్రజలు కరోనా సెకండ్ వేవ్ భయం నుంచి బయటపడే సమయం వచ్చేసింది. రాష్ట్రంలో సెకండ్ వేవ్ గండం గడిచినట్లే కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నమోదవుతున్న కేసులు, పాజిటివిటీ రేట్ చూస్తే ఈ విషయం స్పష్టంగా అర్థమవుతోంది. కరోనా కట్టడిలో లాక్డౌన్ అద్భుతంగా పని చేసింది. ప్రభుత్వ చర్యలు, ప్రజల జాగ్రత్తలు కూడా కరోనా సెకండ్ వేవ్ కట్టడికి కారణాలు.
రాష్ట్రంలో ప్రతీ రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య ఇంచుమించు 2 వేలు మాత్రమే ఉంటుంది. ఇదే సమయంలో టెస్టుల సంఖ్య భారీగా పెరిగింది. అయినా కూడా కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. జూన్ 5వ తేదీన రాష్ట్రంలో కేవలం 1.49 శాతం పాజిటివిటీ రేటు మాత్రమే నమోదైంది. జూన్ 5న ఒక్క రోజే రాష్ట్రంలో లక్షా 38 వేల కరోనా టెస్టులు చేస్తే కేవలం 2 వేల కేసులు మాత్రమే నమోదయ్యాయి.
దేశ సగటుతో చూసుకుంటే ఇది చాలాచాలా తక్కువ. కరోనా పరిస్థితులు అదుపులో ఉండాలంటే పాజిటివిటీ రేటు 5 శాతం లోపు ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్లూహెచ్ఓ) చెప్పింది. ఈ లెక్కన తెలంగాణలో పాజిటివిటీ రేటు 2 శాతం లోపలనే ఉంది కాబట్టి రాష్ట్రంలో కరోనా ప్రభావం తగ్గిందనే చెప్పుకోవాలి. జిల్లాల్లో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది.
ఆదిలాబాద్, కొమ్రం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి జిల్లాల్లో కేవలం సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదవుతున్నాయి.మెదక్, నారాయణపేట, నిర్మల్, నిజామాబాద్, నాగర్‌కర్నూలు జిల్లాల్లోనూ ప్రతీ రోజూ కేవలం 20 – 30 కరోనా కేసులే నమోదవుతున్నాయి. జూన్ చివరి నాటికి కరోనా సెకండ్ వేవ్ నుంచి తెలంగాణ పూర్తిగా బయటపడుతుందనే అంచనాలు ఉన్నాయి.
తెలంగాణలో కరోనా ప్రభావం తగ్గడంలో లాక్డౌన్ బాగా పని చేసింది. లాక్డౌన్ విధించే నాటికి రాష్ట్రంలో 6 శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉండేది. ఇప్పుడు 2 శాతం లోపు ఉంది. ఆసుపత్రుల్లో బెడ్ల ఆక్యుపెన్సీ కూడా 50 శాతం లోపే ఉంటుంది. జూన్ మూడో వారం నాటికి కరోనా నియంత్రణలోకి వస్తుందని తెలంగాణ వైద్యారోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు అంటున్నారు.
రాష్ట్రం మొత్తం చూసుకుంటే కరోనా ప్రభావం వేగంగా తగ్గుతున్నా కూడా గ్రేటర్ హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మేడ్చల్, నల్గొండ, రంగారెడ్డి, పెద్దపల్లి, సూర్యాపేట జిల్లాల్లో మాత్రమే కొంచెం ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్నందున త్వరలోనే అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభం కానుంది. లాక్డౌన్ నుంచి మినహాయింపులు ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉంటే కరోనాను కట్టడి చేయవచ్చు. అన్‌లాక్ ప్రారంభమైన తర్వాత ప్రజలు అజాగ్రత్తగా వ్యవహరిస్తే మాత్రం మళ్లీ కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉంది.