ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయ్యింది. సహజంగానే ఒక కొత్త ప్రభుత్వం, కొత్త ముఖ్యమంత్రి ఏడాది పాలన పూర్తైన సందర్భంగా ప్రజల్లో కొత్త పాలనపై ఎలాంటి అభిప్రాయం ఉందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో జగన్ ఏడాది పాలనపై సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) అనే సంస్థ ఆసక్తికరమైన సర్వే నిర్వహించి ఫలితాలు ప్రకటించింది. సీపీఎస్ సంస్థకు, ఆ సంస్థ చేసే సర్వేలకు తెలుగునాట మంచి ట్రాక్ రికార్డు ఉంది.
ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత ప్రజల మూడ్ ఎలా ఉంది అనేది గుర్తించడంలో సీపీఎస్ సంస్థ సర్వేలు వాస్తవానికి దగ్గరగా ఉంటాయనే అభిప్రాయం ఉంది. గత ఎన్నికల ముందు కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కచ్చితంగా 130కి పైగా అసెంబ్లీ స్థానాలు వస్తాయని సీపీఎస్ సంస్థ బల్ల గుద్ది మరీ చెప్పింది. ఎన్నికల ఫలితాల్లో ఇదే నిజమైంది. కాబట్టి, ఇప్పుడు జగన్ ఏడాది పాలనపై సీపీఎస్ సర్వేను పరిగణలోకి తీసుకోవచ్చు.
జగన్ ఏడాది పాలన ఎలా ఉంది అని ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు ఏపీలో 62.6 శాతం మంది బాగుంది అని సమాదానమిచ్చారు. 36.1 శాతం మంది బాగాలేదని, 1.4 శాతం మంది చెప్పలేమని చెప్పారు. అంతే జగన్ పాలన నచ్చని వారి కంటే నచ్చిన వారి సంఖ్య రెట్టింపు ఉండటం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, ప్రాంతాలవారీగా చూసినప్పుడు కూడా ఈ సర్వే అంచనాలు ఆసక్తి కలిగిస్తున్నాయి. ఉత్తర కోస్తాలో జగన్ పాలన బాగుందని 58.8 శాతం, బాగలేదని 40.0 శాతం మంది అభిప్రాయపడ్డారు.
గోదావరి జిల్లాల్లో 55.8 శాతం మంది జగన్ ఏడాది పాలన బాగుందని చెప్పగా 43.8 శాతం మంది బాగాలేదన్నారు. అమరావతి ప్రాంతంలో 54.9 శాతం మంది జగన్ పాలన పట్ల హ్యాపీగా ఉండగా, 42.1 శాతం మంది అసంతృప్తిగా ఉన్నారు. దక్షిణ కోస్తా జిల్లాల్లో జగన్ పాలనకు ఎక్కువగా మార్కులు పడ్డాయి. ఏకంగా 74.0 శాతం మంది జగన్ పాలన బాగుందనగా 24.3 శాతం మంది మాత్రమే బాగలేదన్నారు. రాయలసీమలో జగన్ పాలన పట్ల 67.1 శాతం మంది సంతృప్తిని వ్యక్తం చేయగా, 31.9 శాతం మంది అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇక, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీకి ఓటేస్తారని సైతం సర్వేలో ప్రజలను అడిగారు. ఈ ప్రశ్నకు కూడా ప్రజల నుంచి ఆసక్తికర జవాబు వచ్చింది. వైసీపీకి 55.8 శాతం మంది ఓటేస్తామని చెప్పారు. అంటే గత ఎన్నికల కంటే ఇది 5 శాతం ఎక్కువ అన్నట్లు లెక్క. ఇదే సమయంలో టీడీపీకి గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు తిరిగి సాధిస్తుందని ఈ సర్వే తేల్చింది. 38.3 శాతం మంది టీడీపీకి ఓటేస్తామని చెప్పారు. బీజేపీ – జనసేన కూటమికి ఓట్లేస్తామని 5.3 శాతం మంది మాత్రమే చెప్పారు. ఇతర పార్టీల వైపు కేవలం 0.7 శాతం మంది మాత్రమే నిలిచారు.
ఉత్తర కోస్తాలో వైసీపీకి 51.1 శాతం మంది, టీడీపీకి 39.7 శాతం మంది ఓటేస్తామని చెప్పారు. గోదావరి జిల్లాల్లో వైసీపీకి 47.3 శాతం, టీడీపీకి 44.9 శాతం ఆదరణ లభించింది. అమరావతి ప్రాంతంలో వైసీపీకి 49.4 శాతం, టీడీపీకి 46.1 శాతం ప్రజలు అండగా ఉంటామని చెప్పారు. దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతంలో వైసీపీ వైపు 66.9 శాతం మంది నిలవగా టీడీపీ వైపు 27.6 శాతం మంది నిలిచారు. రాయలసీమలో 63.8 శాతం మంది వైసీపీకి జైకొట్టగా కేవలం 32.8 శాతం మంది టీడీపీ వైపు నిలిచారు.