హైదరాబాద్ నగర శివార్లలో బీఫార్మసీ విద్యార్థినిపై అత్యాచారం వార్తలు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. ఈ ఘటనపై అనేక వార్తలు వస్తున్నాయి. ఈనేపథ్యంలో రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఈ కేసుపై సంచలన విషయాలను వెల్లడించారు. విద్యార్థినిపై అత్యాచారం జరగలేదని స్పష్టం చేశారు. విద్యార్థిని కిడ్నాప్, అత్యాచారం అంటూ కట్టు కథ అల్లిందని అన్నారు.
పోలీసులు అడిగినప్పుడు తనపై ఆటో డ్రైవర్లు అత్యాచారం చేశారని అబద్దాలు చెప్పింది. కొంత మంది ఆటో డ్రైవర్ల ఫోటోలు చూసి గుర్తించమని అడిగితే గతంలో చిల్లర విషయంలో ఓ ఆటో డ్రైవర్ తో గొడవ జరగడంతో ఆ వ్యక్తిని చూపించిందన్నారు. అయితే ఆమె చెప్పిన విధంగా సీసీ టీవీ ఫుటేజిలో ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు.
యువతి తన దుస్తులు తానె చింపుకొని అత్యాచారం డ్రామా ఆడినట్టుగా తెలిపారు. ఈ విషయాన్ని యువతి తానే ఒప్పుకున్నట్టుగా తెలిపారు. అనుమానితులుగా అదుపులోకి తీసుకున్న నలుగురు ఆటోడ్రైవర్లు ఘటన జరిగిన సమయంలో ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతంలో ఉన్నారన్నారు. దాదాపు 10 సిసి కెమెరాలను పరిశీలించడానికి ఒకటిన్నర రోజు సమయం పట్టిందన్నారు. మూడు రోజులుగా పోలీసులంతా నిద్రాహారాలు మానేసి కేసును ఛేదించాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నోజిగూడా దగ్గరలో 7 గంటల ప్రాంతంలో యువతి నడుచుకుంటూ ఒంటరిగా వెళ్తుందని గుర్తించామన్నారు. అయితే పోలీసుల సైరన్ వినిపించడంతో పరిగెత్తుకుంటూ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లి పడిపోయిందన్నారు. ఆ సమయంలోనే ఆమె కాలికి గాయమైందన్నారు. పోలీసులు వచ్చే సమయానికి ఒంటిపై బట్టలు చించుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నట్టుగా కనిపించిందన్నారు. ఈ కేసులో కిడ్నాప్ గాని అత్యాచారం గాని జరగలేదని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు.