తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరిగిపోతున్న నేపథ్యంలో కరోనా బాధితులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. కాగా లక్షల్లో బాధితుల దగ్గర బిల్లులు వసూలు చేస్తూ కరోనా రోగులకు చుక్కలు చూపిస్తున్నాయి యాజమాన్యాలు. ఆస్తులన్నీ అమ్మి బిల్లులు చెల్లించినా బాధితుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కుటుంబ సభ్యుల మృతదేహాలను అప్పగిస్తున్నారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో నగరంలోని డెక్కన్ ఆసుపత్రిలో కరోనాతో చేరిన ముగ్గురు కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన హృదయవిడ్డరక ఘటన చోటుచేసుకుంది. రోజుల వ్యవధిలోనే తల్లిదండ్రులు, సోదరుడిని కోల్పోయిన బాధితుడు మంత్రి కేటీఆర్ కు ట్వీట్ చేసాడు. 10 రోజులకు 17. 50 లక్షల బిల్లు వేశారు. ఒకవైపు కుటుంబ సభ్యులు కరోనాతో మరణిస్తున్నా బిల్లు కట్టాలని మాపై ఒత్తిడి చేసారు. ఆఖరికి కుటుంబాన్ని పోగొట్టుకున్న నిస్సహాయుడిగా మిగిలిపోయాయని నాలాంటి పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అంటూ బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేసాడు.
వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించిన ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ ను కోరాడు. దీనిపై కేటీఆర్ స్పందించారు. బాధితుడు కుటుంబ సభ్యులను కోల్పోవడం బాధించిందన్నారు. అలాగే ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీపై కేటీఆర్ మండిపడ్డారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కు ట్విట్టర్ ద్వారా కోరారు.