logo

  BREAKING NEWS

పిల్లలపై కరోనా ప్రభావం.. వైరస్ వచ్చినా గుర్తించలేకపోతున్నారా?

కరోనా వైరస్ పిల్లలలో పూర్తిగా ప్రభావం చూపదని, అంతగా భయపడాల్సిన అవసరం లేదని తొలి రోజుల్లో భావించేవారు. కానీ ఈ వైరస్ కు గురించి కొత్త లక్షణాలు అది తన రూపాన్ని మార్చుకుంటున్న తీరును పరిశీలించడం ద్వారా ఆ అనుభవాలను బట్టి ఈ ఆలోచనలు కూడా మార్చుకోవలసి వస్తుంది. కరోనాతో చిన్న పిల్లలకు కూడా కొంత వరకు ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూన్నారు.

కరోనా సోకిన కొందరు చిన్నారుల్లో రక్తనాళాల్లో వాపు పెరిగిపోయి గుండె పనితీరుపై పడుతోందని, 15 నుంచి 30 రోజుల వ్యవధిలో పీడియాట్రిక్ ఇన్‌ఫ్లమేటరీ మల్టీసిస్టమ్‌ సిండ్రోమ్‌(పీఐఎంఎస్‌-టీఎస్‌) అనే అరుదైన సమస్య వస్తోందని లండన్‌లోని కింగ్స్ కాలేజీ శాస్త్రవేత్తలు గుర్తించారు. నెల రోజుల వ్యవధిలో గాంధీ ఆసుపత్రిలో కరోనాతో చేరిన 26 పిల్లల్లో 21 మంది ఈ పీఐఎంఎస్‌-టీఎస్‌ లక్షణాలు వారికి చికిత్స అందించినట్టుగా వైద్యులు వెల్లడించారు. కోవిడ్ కొత్త వైరస్ కావడం వలన ఈ లక్షణాలను గుర్తించడం వారికి కూడా సవాలుగా మారింది. అయితే తల్లిదండ్రులు పిల్లల్లో జ్వరం, దద్దుర్లు వంటి లక్షణాలను గుర్తిస్తే అప్రమత్తమవ్వాలని సూచిస్తున్నారు. వెంటనే చికిత్స అందించడం ద్వారా ఈ వైరస్ ప్రాణాంతకం కాకుండా నివారించవచ్చని అంటున్నారు.

పెద్ద వయసు వారిలో కనిపించే దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యల వంటి కరోనా లక్షణాలు 10 ఏళ్ళ లోపు పిల్లల్లో బయటపడటం లేదు. సాధారణంగా కరోనా శరీరంలోకి వ్యాపించిన 14 రోజులలోగా ఈ లక్షణాలు బయటకు కనిపిస్తుంటాయి. కానీ పిల్లలో ఇందుకు భిన్నంగా 2 వారాల తర్వాత 3, 4 వారాల్లో లక్షణాలను గుర్తిస్తున్నారు. అవి కూడా ఇప్పటివరకు కరోనా లక్షణాలుగా చెప్పుకుంటున్న మాదిరిగా కాకుండా తీవ్రమైన జ్వరం, కడుపు నొప్పి, ఒళ్ళంతా దద్దుర్లు వంటి లక్షణాలు ఉంటున్నాయి. వీటిని సాధారణమైన జ్వరం లాగానే తల్లిదండ్రులు భావిస్తుండటంతో వారికి చికిత్స అందించడం ఆలస్యమవుతుందని వైద్యులు పేర్కొన్నారు.

జీర్ణాశయ పేగుల్లో ఉండే కణాలను గ్రాహకాలుగా మార్చుకొని కరోనా వైరస్‌ ఇన్ఫెక్షన్‌ను వ్యాపింపజేసే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. పిల్లల్లో కొన్ని సార్లు అతి సారం రూపంలో కూడా కరోనా అలికిడి మొదలయ్యే సూచనలు ఉంటాయంటున్నారు. వైద్యులు చెప్తున్న వివరాల ప్రకారం పిల్లల్లో ఇప్పటికీ కరోనా ప్రభావం తక్కువగానే ఉంది. అయితే లక్షణాలు మాత్రం 3 నుంచి 4 వారాల్లో ఆలస్యంగా బయటపడుతుండటమే కొత్త విషయంగా చెప్తున్నారు. ఒకవేళ పిల్లలకు కరోనా వచ్చినా భయపడాల్సిన అవసరం లేదని లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స అందించడంలో ఆలస్యం చేయవద్దని సూచిస్తున్నారు.

Related News