కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అభివృద్ధి చేసేందుకు ప్రపంచవ్యాప్తంగా మూడు వందలకు పైగా సంస్థలు పరిశోధనలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని తుది దశకు చేరుకుంటున్నాయి. మన దేశంలో హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అనే సంస్థ కరోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. కోవాగ్జిన్గా ఈ వ్యాక్సిన్‌కు నామకరణం చేసింది. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ తుది దశకు చేరుకున్నాయి.
హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో ఇప్పటికే కోవాగ్జిన్ వ్యాక్సిన్ ఫస్ట్, సెకండ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ పూర్తయ్యాయి. రెండు దశల ట్రయల్స్ కూడా విజయవంతమయ్యాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాలంటీర్ల ఆరోగ్య పరిస్థితిని వైద్చ బృందం నిత్యం పర్యవేక్షిస్తోంది. ఇప్పటివరకు వాలంటీర్లలో వ్యాక్సిన్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా యాంటీబాడీస్ ఉత్పత్తి బాగా జరుగుతోంది. దీంతో రెండు దశల ట్రయల్స్ సక్సెస్ అయినట్లే వైద్యులు భావిస్తున్నారు.
చివరగా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరగాల్సి ఉంది. మూడో దశ ట్రయల్స్ జరపడానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు రావాల్సి ఉంది. ఇప్పటివరకు పూర్తైన మొదటి దశకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని భారత్ బయోటెక్ డీసీజీఐకి అందించింది. రెండో దశకు సంబంధించి కూడా కొంత సమాచారాన్ని ఇచ్చింది. ఇప్పుడు రెండో దశ క్లినిక్ ట్రయల్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అందించాల్సిందిగా డీసీజీఐ.. భారత్ బయోటెక్‌ను కోరింది.
రెండో దశ క్లినికల్ ట్రయల్స్ సమాచారాన్ని పూర్తిగా విశ్లేషించి అంతా విజయవంతంగా జరుగుతోందని నిర్ధారించుకున్న తర్వాత డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరపడానికి భారత్ బయోటెక్‌కు అనుమతి లభిస్తుంది. మూడో దశలో భాగంగా దేశంలోని 19 ప్రదేశాల్లో 18 ఏళ్లు పైబడిన 28,500 మంది వాలంటీర్లపై కోవాగ్జిన్ క్లినికల్ ట్రయల్స్ జరపాలని భారత్ బయోటెక్ నిర్వహించింది.
మూడో దశ క్లినికల్ ట్రయల్స్ జరిపేందుకు భారత్ బయేటెక్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఒకసారి డీసీజీఐ నుంచి అనుమతులు వచ్చాక ఈ ట్రయల్స్ ప్రారంభమవుతాయి. ఇవి విజయవంతంగా పూర్తైతే కోవాగ్జిన్ క్లినకల్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్నట్లు అవుతుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2021 జనవరి నాటికే కోవాగ్జిన్‌ను అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.