హైదరాబాద్ బోయిన్ పల్లి కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రముఖుల పేర్లు కూడా వినిపిస్తుండటంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హైదరాబాద్ లోని ఓ భూవ్యవహారంలో బాధితులను కిడ్నాప్ చేసి వారి నుంచి విలువైన పత్రాలు తీసుకుని సంతకాలు తీసుకున్నారు. ఆ తర్వాత వారిని బెదిరించి వదిలిపెట్టారు.
ఈ కేసులో ఇప్పటికే కిడ్నపర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే కిడ్నాప్ కు పథకం వేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను కూడా పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. కాగా ఆమె భర్త భార్గవ్ రామ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అయితే గర్భవతిగా ఉన్న అఖిల ప్రియకు ఈ కేసులో బెయిల్ లభిస్తుందా? లేక కోర్టు కస్టడీ విధిస్తుందా? అనే అంశంపై ఉత్కంఠ వీడింది.
భూమా అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టు షాకిచ్చింది. అఖిల ప్రియను పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆమెకు బెయిల్ లభిస్తే సాక్ష్యాధారాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఈ కేసులో కిడ్నాపర్లు బాధితులతో సంతకాలు చేయించుకున్న పేపర్లు స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించాలని, అలాగే కిడ్నాప్ సీన్ ను రీ కంస్ట్రక్షన్ చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు కోర్టులో వాదనలు వినిపించారు.
వీటితో పాటుగా అఖిల్ ప్రియ ఆరోగ్య పరిస్థితిపై చంచల్ గూడా జైలు అధికారులు మెడికల్ రిపోర్టును కోర్టుకు అందించారు. దీని ఆధారంగానే కోర్టు తీర్పునిచ్చింది. ప్రస్తుతం చంచల్ గూడా జైలులో ఉన్న అఖిలప్రియను ఈరోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు మూడు రోజుల పాటు పోలీసు కస్టడీకి అప్పగించనున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో అఖిల ప్రియ పాత్రపై పోలీసులు ఆమెను విచారించనున్నారు.