స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య పేచీ కొనసాగుతోంది. ఎన్నికలు వెంటనే నిర్వహించాలనే పట్టుదలతో ఎన్నికల సంఘం ఉంది. అయితే, ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాల్సినంత అవసరం లేదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం కమిషన్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య విభేదాలు ఉండటంతో ఎన్నికల నిర్వహణపై రెండు వైపులా పట్టుదలతో ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో తన పదవీకాలం ముగిసే లోపు స్థానిక సంస్థలను నిర్వహించాలని నిమ్మగడ్డ కంకణం కట్టుకున్నారు. ఈ అంశంపై రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టును ఆశ్రయించింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించడం లేదని, సహకరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరింది. అయితే, కరోనా విజృంభిస్తున్న కారణంగా ఇప్పుడు ఎన్నికల నిర్వహణకు సిబ్బందిని కేటాయించలేమని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.
ఈ అంశంపై ఇవాళ మరోసారి హైకోర్టులో విచారణ జరిగింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే, ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రజలకు కరోనా వైరస్ వ్యాక్సిన్ అందించాలని, కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించలేమని కోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసింది. వ్యాక్సిన్ పంపిణీ పనిలో ఉంటారు కాబట్టి ఎన్నికల కోసం సిబ్బందిని, పోలీసులను కేటాయించలేమని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
కరోనా సెకండ్ వేవ్ అనే అంశాన్ని బూచీగా చూపించి ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలు వద్దని చెబుతుందని అందరూ అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా కరోనా వ్యాక్సిన్ అంశాన్ని తెరపైకి తెచ్చిన ప్రభుత్వం ఎన్నికల నిర్వహించాలనుకుంటున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్కు షాక్ ఇచ్చింది. అయితే, ప్రభుత్వ వాదనపై తాము కౌంటర్ దాఖలు చేస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కోర్టుకు తెలిపింది.