బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న మాజీ మంత్రి భూమా అఖిల ప్రియకు కోర్టు భారీ షాకిచ్చింది. బెయిల్ కోసం ఆమె పెట్టుకున్న పిటిషన్ ను సికిందరాబాద్ కోర్టు కొట్టివేసింది. భూమా అఖిల ప్రియ ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.
అదే సమయంలో అఖిల ప్రియకు బెయిల్ లభిస్తే సాక్ష్యాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని పోలీసులు కూడా గట్టిగానే వాదించారు. ఈ నేపథ్యంలో సికిందరాబాదు కోర్టు ఆమెకు బెయిల్ ను తిరస్కరించింది. ఈ సందర్భంగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవితకాలం శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు తమ పరిధిలోకి రావని సెషన్స్ కోర్టులో పిటిష దాఖలు చేయాలంటూ కోర్టు వ్యాఖ్యానించడం గమనార్హం.
అనంతరం బెయిల్ పిటిషన్ ను తిప్పిపంపింది. కాగా భూమా అఖిల ప్రియా బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురి కావడం ఇది రెండో సారి గతంలో కూడా బెయిలు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఈసారి నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
కాగా అఖిల ప్రియపై ఈ కిడ్నాప్ కేసులో అదనపు సెక్షన్ల (ఐపీసీ సెక్షన్ 395 డెకయిట్ (దోపిడీ)) కింద కేసులు నమోదు చేసినట్లుగా పోలీసులు మెమోను దాఖలు చేసారు. ఈ సందర్భంగా కోర్టు ఈ కేసును జీవితకాలం శిక్ష పడే కేసుగా వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.