చైనాతో సరిహద్దు పంచుకోవడం భారత్‌కు ఒక ప్రధాన సమస్యగా మారింది. పక్క దేశాల భూభాగాలను ఆక్రమించుకోవాలని ఎప్పుడూ కాచుకొని కూర్చునే చైనాతో మనకు సుమారు 4 వేల కిలోమీటర్ల మేర సరిహద్దు ఉంది. భారత్‌లోని చాలా ప్రాంతాలను చైనా తమవే అని వాధిస్తూ ఉంటోంది. ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తోంది. చైనా నుంచి మన భూభాగాన్ని కాపాడుకోవడం కోసం వేలాది మంది భారతీయ సైనికులు ఈ 4 వేల కిలోమీటర్ల సరిహద్దుల్లో పహారా కాస్తూ ఉంటారు.
కానీ, చాలా మందికి తెలియని విషయం ఏంటంటే చైనాతో మనకు సరిహద్దు ఉండదు. ఉన్నా కేవలం లడ్ఢాఖ్‌లోని కొన్ని కిలోమీటర్ల వరకే ఉంటుంది. మనకు సుదీర్ఘ సరిహద్దు టిబెట్‌తో ఉంటుంది. అయితే 1950 ప్రాంతంలో టిబెట్ దేశాన్ని చైనా ఆక్రమించుకోవడంతో మనకు అనివార్యంగా చైనాతో 4 వేల కిలోమీటర్ల సరిహద్దు ఏర్పడింది. ఫలితంగా ఇప్పుడు చైనా మనకు పక్కలో బల్లెంగా మారింది. అదే టిబెట్ ఇంకా ఒక స్వతంత్య్ర దేశంగా ఉండి ఉంటే చైనాతో మనకు ఎటువంటి సమస్యలూ వచ్చి ఉండేవి కాదు.
టిబెట్‌ను చాలా మంది ఒక చిన్న దేశం అని అనుకుంటారు. కానీ, టిబెట్ చాలా పెద్దది. టిబెట్ ఇప్పుడు స్వతంత్య్ర దేశంగా ఉండి ఉంటే ప్రపంచంలోనే పదో పెద్ద దేశంగా ఉండి ఉండేది. సంస్కృతికంగా, సహజ వనరుల పరంగా, ఆధ్యాత్మిక పరంగా టిబెట్ ఎంతో ఉన్నతమైన ప్రాంతం. అయితే, ఈ దేశాన్ని 1950 ప్రాంతంలో చైనా ఆక్రమించేసింది. టిబెటెన్ల గురువు 14వ దలైలామాను బందీని చేయాలని ప్రయత్నించింది. దీంతో ఆయన తప్పించుకొని భారత్‌కు వచ్చారు.
దలైలామాతో పాటు వేలాది మంది టిబెట్ ప్రజలు భారత్‌లోకి పారిపోయి వచ్చారు. వీరికి ఆనాటి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ ఆశ్రయం కల్పించేందుకు అంగీకరించారు. దీంతో టిబెట్ నుంచి వచ్చిన వారంతా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఎక్కువ మంది మాత్రం హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చి ధర్మశాల ప్రాంతంలో స్థిరపడ్డారు. సుమారు లక్ష మంది టిబెటన్లు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. దలైలామా ఉండేది కూడా ఇక్కడే.
టిబెట్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని టిబెటన్లు చైనాను డిమాండ్ చేస్తున్నారు. చైనా మాత్రం టిబెట్‌ను స్వతంత్య్ర దేశంగా ఒప్పుకోవడం లేదు. దీంతో టిబెట్లు 60 ఏళ్లుగా స్వాతంత్య్ర కోసం పోరాడుతున్నారు. ఈ క్రమంలో భారత్‌తో పాటు వివిధ దేశాల్లో స్థిరపడిన టిబెటన్లు ప్రవాస ప్రభుత్వాన్ని, పార్లమెంటును ఏర్పాటు చేసుకున్నారు. మన దేశంలోని ధర్మశాల కేంద్రంగానే టిబెట్ పార్లమెంటు, ప్రభుత్వం నడుస్తుంది.
ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు ఎన్నికలు కూడా జరుగుతాయి. 2011కు ముందు దలైలామానే టిబెటన్లకు అధినేతగా, గురువుగా ఉండేవారు. అయితే, ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలకు పరిమితం కావాలని నిర్ణయించుకోవడంతో 2001 నుంచి ప్రజాస్వామిక పద్ధతుల్లో ఎన్నికలు నిర్వహించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రవాస టిబెట్ ప్రభుత్వానికి అధ్యక్షుడిగా లాబ్సాంగ్ సాంగే ఉన్నారు.
ఈ ప్రభుత్వానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన టిబెటన్లు విరాళాలు ఇస్తారు. భారత్, అమెరికా వంటి దేశాలు కూడా ఆర్థిక సాయం చేస్తాయి. ఈ డబ్బులతోనే ప్రవాస టిబెట్ ప్రభుత్వం నడుస్తుంది. టిబెటన్లకు ఈ ప్రభుత్వం ప్రతినిధిగా ఉంటుంది. టిబెటన్ల అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. వారి కోసం ప్రత్యేకంగా పాఠశాలలను కూడా నిర్వహిస్తోంది. చైనా నుంచి స్వాతంత్య్రం పొందాలనేది ఈ ప్రభుత్వం లక్ష్యం. అయితే, చైనా మాత్రం ప్రవాస టిబెట్ ప్రభుత్వాన్ని గుర్తించదు. ఒకవేళ టిబెటన్ల కల ఫలించి ఇది స్వతంత్య్ర దేశం అయితే భారత్‌కు చాలా మేలు. మనకు చైనాతో సరిహద్దు పూర్తిగా తగ్గిపోతుంది.