logo

  BREAKING NEWS

ఇది విన్నారా..? కుంబాల గోత్రం.. ఆర్త్రా న‌క్ష‌త్రం.. జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి  |   ఏ వయసు వారికి టీకా వేస్తారు? సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?  |   జనగామకు బీజేపీ చీఫ్ బండి సంజయ్.. ఉద్రిక్త వాతావరణం  |   సీరం కీలక ప్రకటన.. కరోనా వాక్సిన్ ధర ఎంతంటే?  |   చంద్రబాబు వ్యాఖ్యల దుమారం.. భారీ షాకిచ్చిన సొంత పార్టీ నేతలు!  |   వ్యవసాయ చట్టాలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు!  |   అప్ప‌టినుంచే రామ్‌తో ప‌రిచ‌యం.. ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పిన సునీత  |   ఏపీ గవర్నర్ తో నిమ్మగడ్డ భేటీ.. ఏం జరుగుతోంది?  |   బ్రేకింగ్: హైదరాబాద్ కు కరోనా వాక్సిన్!  |   బ్రేకింగ్ : ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం.. నిమ్మగడ్డకు భారీ ఎదురుదెబ్బ!  |  

క‌రోనా వ్యాక్సిన్‌లు వ‌చ్చేశాయి.. ఏ వ్యాక్సిన్ రేటు ఎంతో తెలుసా ?

ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న క‌రోనా వైర‌స్ పుట్టి ఏడాది పూర్తైన త‌ర్వాత ఈ మాయ‌దారి వ్యాధికి వ్యాక్సిన్‌లు అందుబాటులోకి వ‌స్తున్నాయి. ర‌ష్యా త‌యారుచేసిన స్పూత్నిక్ – వి వ్యాక్సిన్ ఇప్ప‌టికే ఆ దేశ పౌరుల‌కు ఇస్తున్నారు. అమెరికా, కెనెడా, బ్రిట‌న్‌లో ఫైజ‌ర్ వ్యాక్సిన్ ఆ దేశాల ప్ర‌జ‌ల‌కు అందించ‌డం ప్రారంభ‌మైంది. మ‌న దేశంలోనూ వ్యాక్సిన్ అందించ‌డానికి ఏర్పాట్లు వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని వ్యాక్సిన్‌లు ఇప్ప‌టికే అందుబాటులోకి రాగా, 2021 మొద‌ట్లో మ‌రికొన్ని అందుబాటులోకి వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలో ఏ వ్యాక్సిన్ ధ‌ర ఎంత ఉంటుంది అనే విష‌యాలు ఓసారి చూద్దాం.

ఫైజ‌ర్ వ్యాక్సిన్‌
అమెరికాకు చెందిన ప్ర‌ఖ్యాత ఫార్మా సంస్థ ఫైజ‌ర్‌. ఈ సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ అన్ని అనుమ‌తులు పొంది అందుబాటులోకి వ‌చ్చింది. 90 శాతానికి పైగా ఈ వ్యాక్సిన్ స‌త్ఫ‌లితాలు ఇస్తోంది. దీంతో అమెరికా, కెనెడా, బ్రిట‌న్‌లో ఈ వ్యాక్సిన్ ప్ర‌జ‌ల‌కు అందిస్తున్నారు. ఈ వ్యాక్సిన్ ధ‌ర 37 డాల‌ర్లు. మ‌న క‌రెన్సీలో రూ.2,700కు పైగా ఉంటుంది. ఈ వ్యాక్సిన్‌ను మైన‌స్ 70 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్ర‌త‌లో ఉంచాల్సి ఉంటుంది. ధ‌ర ఎక్కువ కావ‌డం, మైన‌స్ 70 డిగ్రీ ఉష్ణోగ్ర‌త‌లో వ్యాక్సిన్‌ను స్టోర్ చేసే స‌ధుపాయాలు మ‌న దేశంలో లేనందున ఫైజ‌ర్ వ్యాక్సిన్‌పైన భార‌త ప్ర‌భుత్వం అంత‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు.

స్పూత్నిక్ – వి
ర‌ష్యాకు చెందిన గ‌మ‌లేయ యూనివ‌ర్సిటీ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ 91.4 శాతం ప్ర‌భావం చూపిస్తోంద‌ని తేలింది. మ‌న దేశంలో డాక్ట‌ర్ రెడ్డీస్ ల్యాబొరేట‌రీస్ వాళ్లు ర‌ష్యాతో ఒప్పందం చేసుకొని స్పూత్నిక్ – వి మూడో ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ చేస్తున్నారు. ఇవి విజ‌య‌వంత‌మైతే భార‌త్‌లో డాక్ట‌ర్ రెడ్డీస్ సంస్థనే వ్యాక్సిన్‌ను స‌ర‌ఫ‌రా చేస్తుంది. ఒక్క డోసు స్పూత్నిక్ – వి వ్యాక్సిన్ ధ‌ర 10 డాల‌ర్లు అంటే రూ.735 ఉంటుందని అంచ‌నా.

కోవిషీల్డ్‌
ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా సంస్థ క‌లిసి కోవిషీల్డ్ అనే పేరుతో వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. మ‌న దేశంలోని పూణేకు చెందిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంస్థ ఈ వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ధ‌ర కేవ‌లం 3 డాల‌ర్లు అంటే రూ.221గా నిర్ణ‌యించారు. త‌క్కువ ధ‌ర కావ‌డం, మ‌న దేశంలోనే ఉత్ప‌త్తి అవుతుండ‌టంతో మ‌న ప్ర‌భుత్వం కోవిషీల్డ్‌ను కొనుగోలు చేయ‌డానికే ఆస‌క్తి చూపిస్తోంది. ముందుకు 68 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను మ‌న కేంద్ర ప్ర‌భుత్వం కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది. ఇందుకు గానూ రూ.13,900 కోట్లు వెచ్చించాల్సి ఉంటుంది.

భార‌త్ బ‌యోటెక్ వ్యాక్సిన్‌
మన హైద‌రాబాద్‌కు చెందిన భార‌త్ బ‌యోటెక్ సంస్థ కోవాక్సిన్ పేరుతో క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్ర‌స్తుతం మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ కొన‌సాగుతున్నాయి. ఈ వ్యాక్సిన్ కూడా బాగా ప‌ని చేస్తోంది. ఇటీవ‌లే ప్ర‌ధాని మోడీ, 60 దేశాల రాయ‌బారులు భార‌త్ బ‌యోటెక్‌ను సంద‌ర్శించి వ్యాక్సిన్ గురించి తెలుసుకున్నారు. కోవాక్సిన్ 2021 మొద‌టి మూడు నెల‌ల్లో అందుబాటులోకి వ‌స్తుంది. ఈ వ్యాక్సిన్ ధ‌ర రూ.220 నుంచి రూ.440 వ‌ర‌కు ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

జైడ‌స్ క్యాడిలా వ్యాక్సిన్‌
మ‌న దేశంలోనే అభివృద్ధి అయిన‌, త‌యార‌వుతోన్న మ‌రో వ్యాక్సిన్ ఇది. అహ్మ‌దాబాద్‌కు చెందిన జైడ‌స్ క్యాడిలా సంస్థ ఈ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ప్ర‌స్తుతం చివ‌రి ద‌శ క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ జ‌రుగుతున్నాయి. ఇది కూడా 2021 మొద‌ట్లో అందుబాటులోకి వ‌స్తుంది. దీని ధ‌ర కూడా రూ.220 నుంచి రూ.440 మ‌ధ్య ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

మోడ‌ర్నా వ్యాక్సిన్‌
అమెరికాకు చెందిన మోడ‌ర్నా ఫార్మా కంపెనీ కూడా ఒక వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఇది 95 శాతం ప్ర‌భావం చూపిస్తోంది. అన్ని వ్యాక్సిన్‌ల కంటే ఈ వ్యాక్సిన్ ధ‌ర ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంది. ఒక్క డోసు వ్యాక్సిన్ ధ‌ర 32 డాల‌ర్లు అంటే రూ.2,300కు పైగా ఉండ‌వ‌చ్చు.

జాన్స‌న్ ఆండ్ జాన్స‌న్ వ్యాక్సిన్‌
ప్రపంచ ప్ర‌ఖ్యాత ఫార్మా సంస్థ జాన్స‌న్ ఆండ్ జాన్స‌న్ కూడా క‌రోనా వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. ఈ వ్యాక్సిన్ ఇప్పుడు క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ ద‌శ‌లో ఉంది. ఈ వ్యాక్సిన్ ధ‌ర రూ.10 డాల‌ర్లు అంటే రూ.730 వ‌ర‌కు ఉంటుంది.

Related News