కరోనా ప్రభావం వృద్ధులపై అధికంగా ఉంటుందని వైద్యులు పదేపదే చెబుతున్నారు. వైరస్ వ్యాపించే అవకాశాలతో పాటు వైరస్ ఎక్కువ ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా వృద్ధులకే ఎక్కువగా ఉంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం హెచ్చరించింది. సాధారణంగా వృద్ధుల్లో రోగ నిరోధక శక్తి తక్కువ ఉండటం వల్ల వైరస్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉండడంతో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించింది. నోవెల్ కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో మన ఇంట్లో 50 ఏళ్లకు పైబడిన వృద్ధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కేంద్ర వైద్య ఆరోగ్య మరియు కుటుంబ మంత్రిత్వ శాఖ జారీ చేసింది.
వృద్ధులలో రోగనిరోధక శక్తి, శరీర పటుత్వము తక్కువగా ఉంటుంది. కోవిడ్ – 19 వ్యాధి సోకే అవకాశాలు వృద్ధుల్లో ఎక్కువగా ఉంటాయి. వ్యాధి సోకిన తర్వాత కూడా షుగర్, ఆస్తమా వంటి దీర్ఘకాలిక వ్యాధుల వల్ల వీరు కోవిడ్ వ్యాధిని ఎదుర్కోవడం కూడా కష్టమవుతుంది. కాబట్టి వృద్ధులు కరోనా వైరస్ బారిన పడకుండా పలు జాగ్రత్తలు కచ్చితంగా తీసుకోవాలి. వృద్ధులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానికి సంబంధించి కేంద్ర ఆరోగ్య శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది.
ముఖ్యంగా 60 ఏళ్ల పైబడిన వృద్ధులు ఇంట్లోనే ఉండాలి. బయటి వారిని, సందర్శకులను కలవకుండా ఉండాలి. ఒకవేళ కలవాల్సి వస్తే కనీసం ఒక మీటరు దూరం పాటించాలి. సబ్బు మరియు నీటితో క్రమం తప్పకుండా చేతులు, ముఖం కడగడం, దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టడం, టిష్యూ పేపర్ వాడి పారవేయడం లేదా రుమాలును ఉపయోగించి తరువాత శుభ్ర పరచడం లాంటివి అలవాటు చేసుకోవాలి.
తాజాగా ఇంట్లో వండిన వేడి భోజనం తీసుకుంటూ, ఒంట్లో తరచూ హైడ్రేటింగ్ మరియు రోగనిరోధక శక్తిని పెంచడానికి తాజా పళ్ల రసాలు తీసుకోవాలి. వృద్ధులు కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి శస్త్ర చికిత్సలను వాయిదా వేసుకోవాలి. ఆరోగ్య సంరక్షణకు ఎప్పటికప్పుడు వైద్యులను ఫోన్ లో సంప్రదించి తదనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. పార్కులు, మార్కెట్లు, మత సంబంధమైన ప్రదేశాలు వంటి రద్దీ ప్రాంతాలకు వెళ్లకూడదు.
కరోనా వైరస్ ప్రభావం వృద్ధులపై ఎక్కువగా ఉంటుందనేది మరణాల రేటు చూసినా అర్థం అవుతుంది. యువత ఈ వైరస్ను సులువుగానే జయిస్తున్నారు. చాలామంది యువతలో ఈ వైరస్ సోకిన తర్వాత కూడా లక్షణాలు ఉండటం లేదు. కానీ, వీరు ఇంట్లోని వృద్ధులను కలవడం వల్ల ఈ వైరస్ను వారికి అంటిస్తున్నారు. కాబట్టి, బయట తిరిగే వారు కూడా ఇంట్లోని వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది.