కరోనా వైరస్ ప్రపంచంపై దాడి మొదలుపెట్టి సుమారు 9 నెలలు గడిచింది. అంతకుముందు ఈ వైరస్‌కు సంబంధించి ప్రపంచం ఏ విధంగానూ అప్రమత్తంగా లేదు. వైరస్ మొదలైన నాటి నుంచి వైరస్‌ను కనుగొనే టెస్టులు, చికిత్స విధానం, వ్యాక్సిన్ అభివృద్ధిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో చాలా వరకు మెరుగైన ఫలితాలు వస్తున్నాయి. తాజాగా, కరోనా టెస్టుల విషయంలో లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ పరిశోధకులు కూడా నూతన కరోనా టెస్టింగ్ విధానాన్ని కనిపెట్టారు.
కరోనా వైరస్‌ను గుర్తించడానికి ఇప్పటివరకు ఆర్టీ-పీసీఆర్, యాంటీజెన్, యాంటీబాడీ వంటి టెస్టులు ఉన్నాయి. వీటిలో ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లోనే నాణ్యత ఎక్కువ. అంటే ఈ పరీక్షల ఫలితాలు చాలావరకు కరెక్ట్‌గా ఉంటాయి. ఈ పరీక్షలు చేయడానికి ముక్కు లేదా నోటి నుంచి స్వాబ్ తీసుకొని చేస్తారు. కానీ, వంద శాతం సరైన ఫలితాలు మాత్రం రావు. ఇప్పటివరకు ఏరకమైన కరోనా పరీక్షలో కూడా ఇవి వంద శాతం కచ్చితమైన ఫలితం అని చెప్పలేము. వైరస్ బాధితులను గుర్తించడంలో ఇది ఇప్పటివరకు ప్రధాన సమస్యగా ఉండేది.
ఇప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వారు దీనికి పరిష్కారం కనుగొన్నారు. రవి గుప్త అనే ప్రొఫెసర్ నేతృత్వంలోని బృందం ఎస్ేఎంబీఏ-2 అనే పరీక్ష విధానాన్ని కనుగొన్నారు. ఇది పీసీఆర్, యాంటీబాడీ టెస్ట్‌లను మేళవించి చేసే టెస్ట్. దీని ద్వారా వంద శాతం కచ్చితత్వంతో కూడిన ఫలితం వస్తుంది. అందుకే ఈ పరీక్ష విధానాన్ని కరోనా పరీక్షల్లో గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్‌గా చెబుతున్నారు. ఇప్పటికే కేంబ్రిడ్జ్ హాస్పిటల్లో ఈ విధానం ద్వారా పరీక్షలు జరుపుతున్నారు.