ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారితో మానవాళి సహజీవనం చేయాల్సిందేనా ? అంటే అవుననే సమాదానం చెబుతున్నారు కొందరు శాస్త్రవేత్తలు. అయితే, కరోనా తీవ్రత ఇప్పుడు ఉన్నంత ఎక్కువగా భవిష్యత్‌లో ఉండదని అంచనా వేస్తున్నారు. తాజాగా అమెరికా, నార్వే దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు భవిష్యత్‌లో కరోనా ఎలా ఉండవచ్చనే అంశంపై శాస్త్రీయ అంచనా వేసి కీలక విషయాలను వెల్లడించారు.
ఇప్పుడు మహమ్మారిలా మారి ఉధృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్ ఇక మీదట కూడా ప్రపంచంలో కొనసాగుతుందని వీరు చెబుతున్నారు. కాకపోతే దీని ప్రభావం చాలా తగ్గిపోతుందని వెల్లడించారు. వివిధ రకాల వైరస్ల వల్ల సాధారణంగా మనకు జలుబు చేస్తుంది. భవిష్యత్‌లో కరోనా వైరస్ కూడా సాధారణ జలుబు కలిగించేంత క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.
గతంలో ప్రపంచంపై దాడి చేసిన వైరస్లు, ఫ్లూలు కూడా ఇప్పుడు సాధారణ జలుబు కలిగించేంతగా క్షీణించాయని, భవిష్యత్‌లో కరోనా పరిస్థితి కూడా ఇంతేనని చెప్పారు. కరోనా వైరస్‌తో పాటు ఏ వైరస్ ప్రభావమైనా సాధారణంగా పెద్దలపైనే ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల కూడా ఎక్కువగా పెద్ద వయస్సు వారే మరణిస్తున్నారు. అయితే, పెద్దలు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల లేదా ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడటం వల్ల వారిలో భవిష్యత్‌లో కరోనా ప్రభావం పెద్దగా ఉండదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాబట్టి, చిన్నారుల వైపు కరోనా మళ్లుతుందని తెలిపారు. పిల్లల్లో కరోనా పెద్దగా ప్రభావం చూపించలేదు కాబట్టి పిల్లలకు కూడా ముప్పు తక్కువేనని అంచనా వేశారు. ఈ విషయాలను నార్వేకు చెందిన శాస్త్రవేత్త ఒటార్ జోర్న్స్టడ్ వెల్లడించారు. చివరగా, ఈ అధ్యయనం రెండు విషయాలను స్పష్టం చేస్తోంది. ఒకటి.. కరోనా వైరస్ అనేది ఎప్పటికీ ప్రపంచంలో ఉండిపోతుంది. రెండోది.. కరోనా వైరస్ అనేది మామూలు జలుబు స్థాయికి క్షీణించిపోతుంది. మరి, ఈ అధ్యయనం ఎంతవరకు నిజమవుతుందో చెప్పలేం.