దేశంలో కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ప్రజాజీవనం అస్తవ్యస్తం అయ్యింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షల్లో కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. అసలు ఈ వైరస్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే అందరూ చైనా వైపే వేలెత్తిచూపుతారు. ఈ వైరస్ పుట్టింది చైనా లోని వుహాన్ ల్యాబ్ లోనే అనేది జగమెరిగిన సత్యం. వైరస్ ఆనవాళ్లను గుర్తించినా వైరస్ ను కట్టడి చేయడంలో, ఇతర దేశాలను అప్రమత్తం చేయడంలో అక్కడి ప్రభుత్వం విఫలమైంది.
కానీ చైనా మాత్రం మొదటి నుంచి అందుకు ఒప్పుకోవడం లేదు. ఈ వైరస్ ను మొదటి సారి వుహాన్ లో గుర్తించినంత మాత్రాన ఈ వైరస్ చైనాలోనే పుట్టిందని అనడానికి లేదు అని ఆ దేశం వాదిస్తోంది.
కానీ ప్రపంచమంతా ఈ ఉపద్రవానికి కారణం చైనానే అని బలంగా నమ్ముతుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా కరోనాను చైనా వైరస్ అని పిలిచిన సంగతి తెలిసిందే. గతంలో ఇటలీ, అమెరికా, ఐరోపా దేశాల నుంచి కరోనా పుట్టుకొచ్చిందని చైనా ఆరోపణలు చేసింది. అవన్నీ నిరాధారమైనవిగానే మిగిలాయి. తాజాగా కరోనా కొత్త కుట్రకు తెర లేపుతున్నట్టుగా అనిపిస్తుంది. కరోనా భారత్ లోనే పుట్టిందని చెప్తుంది. షాంఘై ఇన్స్టిట్యూట్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకులు రాసిన ఒక ఆర్టికల్ ప్రకారం, గత ఏడాది డిసెంబర్లో వుహాన్లో వైరస్ వ్యాప్తికి ముందే భారత ఉపఖండంలో కరోనా వైరస్ ఉనికిలో ఉందని పేర్కొన్నారు.
మొత్తం 17 దేశాల్లోని కరోనా వైరస్ జన్యుక్రమాలపై పరిశోధనల అనంతరం ఈ నివేదికను రూపొందించినట్లు చైనా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ప్రస్తుతం వ్యవహారం చర్చనీయాంశంగా మారుతుంది. చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తల బృందం మాట్లాడుతూ కరోనా వైరస్ 2019 వేసవిలో భారతదేశంలో పుట్టి ఉండవచ్చని చెప్పుకొచ్చారు. జంతువుల నుంచి కలుషితమైన నీటి ద్వారా కరోనా వైరస్ మానవులలోకి ప్రవేశించిందని చైనా బృందం తెలిపింది. కరోనా వైరస్ మూలాన్ని గుర్తించడానికి చైనా బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేస్తోంది.
విభిన్న ఉత్పరివర్తనాల ద్వారా వైరస్ మూలాన్ని గుర్తించే ప్రయత్నంలో ఈ బృందం ఫైలోజెనెటిక్ విశ్లేషణను చేసింది. అతి తక్కువ ఉత్పరివర్తనాలతో ఉన్న జాతి అసలుదని వారు వాదించారు. దీన్ని ప్రమాణంగా చూపుతూ పరిశోధకులు మొదటి కేసులు వుహాన్ లో నమోదవ్వలేదని వాదిస్తున్నారు. అందుకు బదులుగా భారతదేశం బంగ్లాదేశ్ వైపు వేలు చూపిస్తున్నారు. ఎందుకంటే తక్కువ మ్యుటేషన్లతో వైరస్ జాతులు ఆ ప్రాంతాల్లో వ్యాప్తి చెందాయన్నది వారి వాదన. ‘భారతదేశంలో పేలవమైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, యువత ఎక్కువగా ఉండటం వల్ల వైరస్ చాలా నెలలు గుర్తించలేదు’ అని చైనా శాస్త్రవేత్తలు పేర్కొనడం గమనార్హం.