కరోనాతో పోరాడుతున్న భారత్ కు డ్రగ్ కంట్రోల్ ఆఫ్ ఇండియా (డీసిజిఐ )శుభవార్త చెప్పింది. భారత్ లో రెండు వాక్సిన్ ల అత్యవసర వినియోగానికి డీసీజీఐ ఆమోదం లభించింది. కొవాగ్జిన్ తో పాటుగా కోవిషీల్డ్ వాక్సిన్ల వినియోగానికి ఆమోదం లభించింది. ఈ రెండు వాక్సిన్లను భారత్ లో వినియోగించేందుకు సిసిఎస్ సివో ఇటీవల సిఫారసు చేసిన విషయం తెలిసిందే.
ఈ మేరకు డీసిజిఐ షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. కోవాగ్జిన్‌ను భారత్ బయోటెక్ అభివృద్ధి చేయగా.. కోవిషీల్డ్‌ను ఆక్స్ ఫర్డ్, అస్త్రాజెనకా, సీరం ఇన్స్టిట్యూట్ అఫ్ ఇండియా కలిసి అభివృద్ధి చేశాయి. ఈ సందర్భంగా డీసిజిఐ డైరెక్టర్ విజి సోమాని మాట్లాడుతూ.. కోవగ్జిన్ వాక్సిన్ తో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని ప్రకటించింది. కాగా ఈ వాక్సిన్ ఇప్పుడు మూడో దశ ట్రయల్స్ ను పూర్తి చేసుకుంటుంది. ఈ రెండు వాక్సిన్లను రెండు డోసులుగా ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు.
ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో భారత్ లో కరోనా వాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. డీసిజిఐ ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలకు ఆయన అభినందనలు తెలియజేసారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వాక్సిన్ డ్రై రన్ నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి దశ వాక్సిన్ పంపిణీలో భాగంగా మూడు కోట్ల మందికి వాక్సిన్ వేయనున్నారు. ఇక ఈ ఏడాది జులై నాటికి 30 కోట్ల మందికి వాక్సిన్ అందుబాటులోకి రానుంది.