కరోనాతో అల్లాడుతున్న భారత్ కు కేంద్ర ఆరోగ్య శాఖ భారీ శుభవార్త వినిపించింది. ఇప్పటికే దేశ వ్యాప్తంగా చేపట్టిన వాక్సిన్ డ్రై రన్ విజయవంతమైన నేపథ్యంలో మరో పది రోజుల్లో కరోనా వాక్సిన్ ను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్టుగా ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ కీలక ప్రకటన చేసారు.
జనవరి 13 తేదీ నుంచి దేశంలో కరోనా వాక్సిన్ ను పంపిణీ చేయబోతున్నారు. ఆక్స్ ఫోర్డ్ – ఆస్ట్రాజెనికా అభివృద్ధి చేసిన కోవి షీల్డ్ తో పాటుగా భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ కు కూడా అత్యవసర వినియోగానికి సంబందించిన అనుమతులను ఇస్తున్నట్టుగా డీసీజీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
వాక్సిన్ పంపిణీ కోసం దేశవ్యాప్తంగా 29 వేల కోల్డ్ చైన్ లను, 4 డిపోలను ఏర్పాటు చేయనున్నారు. వాక్సిన్ డ్రై రన్ లో వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా వాక్సిన్ ను పంపిణీ చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ నేపథ్యంలో మొదట హెల్త్ వర్కర్లకు ఆ తర్వాత పోలీసు సిబ్బందికి వాక్సిన్ పంపిణీ చేపట్టనున్నారు.