కరోనా సోకిన వారిలో వైరస్ తీవ్రతను ముందుగా అంచనా వేయడం దాదాపుగా కష్టంగానే మారింది. కొంత మంది కరోనా నుండి వారం పది రోజుల్లో కోలుకుంటుంటే మరికొంత మందిలో వైరస్ తీవ్ర ఇన్ఫెక్షన్ కు కారణమవుతుంది. వయసుతో సంబంధం లేకుండా ఈ మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇదిలా ఉంటె అమెరికాలోని కాలిఫోర్నియా శాన్‌డియాగో వర్సిటీ శాస్త్రవేత్తలు కొత్త విషయాన్ని వెల్లడించారు.
శారీరక శ్రమ, వ్యాయామానికి దూరంగా ఉండేవారిలోనే కరోనా ఇన్ఫెక్షన్ తీవ్రంగా ఉంటున్న విషయాన్ని వారు గుర్తించారు. వారంలో కనీసం 150 నిమిషాలు వ్యాయామానికి కేటాయించేవారిని కరోనా ఏమీ చేయలేకపోతుందని వెల్లడించారు. ఎవరైతే శారీరక శ్రమకు దూరంగా ఉంటూ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకోవడానికే కేటాయిస్తున్నారో వారికి కరోనా వైరస్ సోకితే పరిస్థితి విషమించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నట్టుగా శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
2020 జనవరి- అక్టోబరు మధ్యకాలంలో కొవిడ్ నిర్ధారణ అయిన 48,440 మంది వయోజనులపై పరిశోధన చేసిన అనంతరం ఈ విషయాన్ని నిర్దారించారు. శరీరానికి తగిన వ్యాయామం లేకపోతే తీవ్రమైన ఇన్ఫెక్షన్, హాస్పిటలైజేషన్, ఐసీయూ పాలవ్వడం , మరణం వంటివి సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయని కనుగొన్నారు. కరోనాను ఎదుర్కోవడంలో పరిశుభ్రత తో పాటుగా ఆరోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ కలిగించే వ్యాయామాలు కూడా ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.