కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచమంతా వాక్సిన్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒక సారి వాక్సిన్ తీసుకుంటే ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడుకోవచ్చని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పుడో వార్త ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. అమెరికాలోని కాలిఫోర్నియాలో నర్సుగా పని చేస్తున్న ఓ వ్యక్తి వారం రోజుల క్రితం కరోనా వాక్సిన్ తీసుకున్నాడు.
ఆ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేసాడు. అయితే రెండు రోజుల వ్యవధిలో అతను క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నాడు. తిరిగి యథావిధిగా తన విధులకు హాజరయ్యాడు. అయితే అప్పటికే అతనికి చలిజ్వరం, నరాల నోపి, అలసటతో బాధపడుతూ కరోనా పరీక్షలు చేయించుకున్నాడు.
ఈ పరీక్షల్లో అతనికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరోనా వాక్సిన్ తీసుకున్న వారానికే అతను కరోనా బారిన పడటం షాక్ కు గురి చేస్తుంది. కాగా అతను ఫైజర్ వాక్సిన్ తీసుకున్నాడు. దీనిపై స్పందించిన వైద్యుల బృందం ఇందులో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదన్నారు.
కరోనా వాక్సిన్ 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తుందని స్పష్టం చేసారు. అయితే ఒకసారి వాక్సిన్ తీసుకుంటే అది ప్రభావం చూపడానికి 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందన్నారు. అప్పటివరకు అన్ని కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా ఫైజర్ వాక్సిన్ తీసుకున్న వారు దానికి తోడుగా మరో రెండు ఇతర డోసులను తీసుకోవలసి ఉంటుంది. ఒక డోసుకి ఇంకో డోసుకి మధ్య నిర్దిష్ట సమయం పాటించాల్సి ఉంటుందని వారు వెల్లడించారు.