తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు కరోనా బారిన పడి కోలుకున్న విషయం తెలిసిందే. అందులో కొందరు కోలుకోగా మరికొందరు కరోనాతో మరణించారు. కాగా తాజాగా మరో మహిళా మంత్రికి కరోనా సోకడం కలకలం రేపుతోంది. టీఆర్ఎస్ మహిళా శిశు సంక్షేమ, గిరిజన అభివృద్ధి శాఖామంత్రి సత్యవతి రాథోడ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది.
జ్వరంతో బాధపడుతున్న ఆమెలో కరోనా లక్షణాలు గుర్తించడంతో పరీక్షలు నిర్వహించారు. అందులో ఆమెకు కరోనా పాజిటివ్ గా తేల్చారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి సత్యవతి రాథోడ్ హోమ్ ఐసోలేషన్ కు వెళ్లిపోయారు. అనంతరం ఆమె యశోదా ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.
కాగా ఇటీవల మంత్రి సత్యవతి రాథోడ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె వరంగల్- ఖమ్మం జిల్లాలో పర్యటించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున ఆమె ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమెతో పలువురు మంత్రులు, నేతలు సన్నిహితంగా మెలిగారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో పక్కనే ఉన్నారు. ఇప్పుడా నేతల్లో కరోనా టెన్షన్ నెలకొంది.