కరోనా వైరస్ అదుపులోకి రావడంతో ఇప్పుడిప్పుడే ఊపిరి పీల్చుకుంటున్న ప్రపంచానికి మరో కొత్త టెన్షన్ మొదలైంది. బ్రిటన్ లో వెలుగు చూసిన కరోనా కొత్త స్ట్రెయిన్ మళ్ళీ వణికిస్తోంది. దీంతో ప్రపంచ దేశాలతో పాటుగా భారత్ కూడా అప్రమత్తమైన విషయం తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు ఈ కొత్త మహమ్మారిపై శుభవార్త వినిపించారు.
ఇప్పుడు బ్రిటన్ లో విస్తరిస్తున్న కరోనా ఆ క్రొత్త స్ట్రెయిన్ భారత్ లోకి ఎప్పుడో ప్రవేశించిందని చెప్పి షాకిచ్చారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అనుబంధ సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈ ఏడాది మార్చిలోనే కరోనా కొత్త స్ట్రెయిన్ ను భారత్ లోని కలకత్తా, ఢిల్లీ, హైదరాబాద్ లలో గుర్తించామన్నారు.
దానిలో ఒక రకాన్ని సూపర్ స్పైడర్ గా గుర్తించామన్నారు. దానికి ‘ఏ4’ గా నామకరణం చేశామన్నారు. అయితే మనలో ఉన్న బలమైన రోగనిరోధక శక్తి కారణంగా జూన్ నెలలోనే ఈ వైరస్ అంతరించిందని వెల్లడించారు. అయితే ఇప్పుడు బ్రిటన్ నుంచి విస్తరిస్తున్న కొత్త స్ట్రెయిన్ పై ఆందోళన అవసరం లేదన్నారు.
కరోనా లాంటి వైరస్ లలో మ్యుటేషన్లు సహజమే అన్నారు. పది నెలలుగా ఈ వైరస్ ఎన్నో రకాలుగా మార్పు చెందిందన్నారు. నెలలో రెండు సార్లు వైరస్ ఉత్పరివర్తనం చెందే అవకాశం ఉంది. కానీ వాటి లక్షణాలలో ఎలాటి మార్పులు ఉండవు. ఈ కొత్త రకమైన కరోనాను ఎదుర్కోవడానికి ఇప్పుడు అందుబాటులో ఉన్న టీకాలలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదు. అవి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటాయి. ఒక వేళ అవసరం వచ్చినా కొత్త రకం వైరస్ తో పోరాడే విధంగా టీకాలో మార్పులు చేసే సామర్థ్యం శాస్త్రవేత్తలకు ఉందన్నారు.