కరోనా పరీక్షలు చేసుకోవడం రోజురోజుకూ సులువవుతోంది. కరోనా వైరస్ మొదలైన కొత్తలో టెస్టు చేయించుకోవడం చాలా పెద్ద కష్టమైన పనిగా ఉండేది. టెస్టు సెంటర్ల వద్ద లైన్లు కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు మన ఇంట్లో, మనకు మనమే కరోనా టెస్టు చేసుకునే అవకాశం లభిస్తోంది. ఇప్పటికీ పుణెకు చెందిన మైల్యాబ్స్ అనే సంస్థ కోవిసెల్ప్ అనే పేరుతో సెల్ప్ కోవిడ్ టెస్టు కిట్‌ను మార్కెట్లోకి రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు ప్రముఖ మెడికల్ డివైజెస్ కంపెనీ అబోట్ లేబోరేటరీస్ కూడా ఒక సెల్ప్ కరోనా టెస్ట్ కిట్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని పేరు బినాక్స్ నౌ. ఇది యాంటీజెన్ టెస్టు కిట్. ఈ కిట్ ద్వారా మనకు మనమే, మన ఇంట్లోనే కరోనా టెస్టు చేసుకొని పాజ్టీవా ? నెగటీవా ? అనే విషయం సులువుగా తెలుసుకోవచ్చు. కేవలం 15 నిమిషాల్లోనే టెస్టు పూర్తయ్యి ఫలితం వస్తుంది.
అబోట్ కరోనా టెస్ట్ కిట్ మార్కెట్లో అందుబాటులోకి వచ్చింది. మెడికల్ షాపుల్లో, ఆన్లైన్ మందుల దుకాణాల్లో, ఈకామెర్స్ వెబ్సైట్లలో కూడా ఈ కిట్‌ను కొనుగోలు చేయవచ్చు. ఒక్కో కిట్ ధర రూ.325గా నిర్ణయించారు. నాలుగు కిట్ల ప్యాకెట్‌కు రూ.1,250, 10 కిట్ల ప్యాకెట్‌కు రూ.2,800, 20 కిట్ల ప్యాకెట్‌కు రూ.5,400గా ధర నిర్ణయించారు.
ఈ కిట్ ద్వారా ఎవరైనా సరే ఇంట్లోనే, ఎవరికి వారే కరోనా టెస్టు చేసుకోవచ్చు. అయితే, ఈ కిట్‌తో పాటు మరో సెల్ప్ కరోనా టెస్ట్ కిట్ అయిన కోవిసెల్ఫ్ కూడా రాపిడ్ యాంటిజెన్ టెస్టులు. రాపిడ్ యాంటీజెన్ టెస్టుల్లో కచ్చితత్వం తక్కువగా ఉంటుంది. ఈ టెస్టులో పాజిటీవ్ అని తేలితే కచ్చితంగా పాజిటీవ్‌గానే భావించాలి. ఒకవేళ కనుక నెగటీవ్ అని తేలినా కచ్చితంగా నెగటీవ్ అని నిర్ధారణకు రాకూడదు. లక్షణాలు ఉంటే మళ్లీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంటుంది.