దేశంలో క్రమంగా కరోనా తీవ్రత పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. మహారాష్ట్ర కేరళతో పాటుగా పంజాబ్, మధ్యప్రదేశ్, జమ్మూ కాశ్మీర్మ, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తుంది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆ రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. గడచిన రెండు మూడు రోజుల్లో పుణేలో రోజుకి 500 పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయి.
నిన్న ఒక్క రోజే 849 కేసులు వెలుగు చూడటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కర్ఫ్యూను విధించింది.సోమవారం రాత్రి నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వస్తున్నట్టుగా ప్రకటించింది. కరోనా తీవ్రత తగ్గుతుందని భావించి తెరిచిన పాఠశాలలను సైతం తిరిగి మూసి వేస్తున్నట్టుగా పూణే డివిజనల్ కమిషనర్ వెల్లడించారు.
ఫిబ్రవరి 28 వరకు కాలేజీలు, పాఠశాలలకు ఈ ఆదేశాలు జారీ చేసారు. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో 14 వేల కొత్త కేసులు నమోదు కాగా అందులో 90 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ గా ఉన్న కేసుల్లో 70 శాతానికి పైగా మహారాష్ట్రలోనే ఉన్నట్టుగా కేంద్రం వెల్లడించింది. మహారాష్ట్రలో 49 వేల యాక్టీవ్ కేసులు ఉండగా కేరళలో అత్యధికంగా 58 వేల కేసులు ఉన్నటుగా కేంద్ర పేర్కొంది.