మూడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెరుచుకున్న శ్రీవారి ఆలయంలో ఇప్పుడు కరోనా కలకలం రేగుతుంది. దీంతో మరోసారి ఆలయ దర్శనాలకు బ్రేక్ పడనుందా అంటే ఇప్పుడు అవుననే వినిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కరోనా స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటివరకు 18 మంది ఆలయ అర్చకులతో పాటుగా మొత్తం 170 మంది ఆలయ సిబ్బందికి కరోనా పాజిటివ్ గా తేలింది.
వీరిలో ప్రధాన ఆలయ జీయర్ కూడా ఉన్నారని టీటీడీ పేర్కొంది. కల్యాణ కట్టకు చెందిన సిబ్బందితో పాటు ప్రసాదాల వేటులో పనిచేస్తున్న సిబ్బంది కూడా కరోనా భారిన పడ్డారు. దీంతో శ్రీవారి దర్శనాలను నిలిపివేసే ఆలోచనలో ఉన్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. అయితే ఈ విషయంపై ఏపీ ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈరోజు టీటీడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. రేపటి నుంచి శ్రీవారికి ఏకాంత పూజలు నిర్వహించే అవకాశం ఉంది.
కరోనా భారిన పడిన అర్చకులతో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో చెన్నై అపోలోకు తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. అయితే మిగిలిన ఆలయ అర్చకులు కూడా ఇటీవల అస్వస్థతకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ కారణంగా ఇటీవల టీటీడీ నిర్వహించిన సమావేశంలో 60 ఏళ్ళు పైబడిన అర్చకులకు విధుల నుంచి మినహాయింపు ఇచ్చామని, వారి భద్రత, ఆరోగ్యమే ముఖ్యంగా దృష్టిసారించామన్నారు అధికారులు. కాగా తిరుపతి మొత్తంగా కరోనా కేసుల సంఖ్య 2000కు చేరుకుంది.