తెలంగాణ కాంగ్రెస్లో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ఎంతకూ ఓ కొలిక్కి రావడం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. పీసీసీ అధ్యక్ష రేసులో చాలామంది నేతలు ఉండటంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరిని నియమించాలనే విషయమై చాలా కసరత్తు చేసింది. గతంలోలాగా కాకుండా ఈసారి పెద్ద ఎత్తున అభిప్రాయ సేకరణ చేయించింది.
అయినా కూడా ఇంతకాలంగా ఏమీ తేల్చలేకపోయిన కాంగ్రెస్ హైకమాండ్ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ లోపే ఈ నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కొత్త పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలు పోటీ పడ్డా చివరకు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మధ్య మాత్రమే ప్రధాన పోటీ ఉంది.
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి 2014 నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకుల్లో ఆయన ఒకరు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంచి క్రేజ్ ఉంది. అన్నింటికీ మించి కాంగ్రెస్ పార్టీ జెండా, అజెండాను మాత్రమే నమ్ముకున్న నాయకుడు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసి పోరాడిన చరిత్ర ఆయనది.
ఇక రేవంత్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మాస్ లీడర్. రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఇమేజ్ ఉంది. కేసీఆర్కు ధీటుగా నిలబడే నాయకుడిగా తెలంగాణ సమాజంలో గుర్తింపు దక్కింది. లేటుగా వచ్చినా కాంగ్రెస్ క్యాడర్ను ఆకర్షించడం ఆయన సఫలమయ్యారు. మంచి వాక్చాతుర్యం ఉంది. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ కూడా చాలా ప్రయత్నిస్తున్నారు.
అభిప్రాయ సేకరణలో ఎక్కువ డీసీసీలు రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు. కానీ, మెజారిటీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు మాత్రం సీనియర్ అయిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పీసీసీ ఇవ్వాలని కోరారు. ఇద్దరు నేతలకూ ఎవరి బలాబలాలు వారికి ఉన్నాయి. అందుకే చివరకు పోటీ ఈ ఇద్దరి మధ్యన ఉంది. ఇద్దరిలో ఎవరికి ఇవ్వకపోయినా మరోకరు పార్టీకి దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఇద్దరిలో ఏ ఒక్కరు పార్టీకి దూరమైనా కాంగ్రెస్కు చాలా నష్టం జరిగే అవకాశం ఉంది.
దీంతో ఇద్దరికీ తగిన గుర్తింపు ఇచ్చి ఇద్దరినీ పార్టీ కోసం గట్టిగా పని చేసేలా చేయాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఇందులో భాగంగా ఒకరికి పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చి మరొకరిని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోకి తీసుకోవాలని లేదా రాష్ట్ర క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్ పదవి ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్ఠానం ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తద్వారా తెలంగాణలో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఇద్దరు నేతలూ శ్రమించేలా చేయొచ్చని భావిస్తోంది.
ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పీసీసీ అధ్యక్షుడే ముఖ్యమంత్రి కావాలి అనే నియమం ఏమీ లేదు. 2004, 2009లో డీఎస్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ వైఎస్సార్ ముఖ్యమంత్రి అయ్యారు. మొన్నటికి మొన్న రాజస్థాన్లో సచిన్ పైలెట్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నా అశోక్ గెహ్లోట్ ముఖ్యమంత్రి అయ్యారు. పీసీసీ అధ్యక్షుడే సీఎం క్యాండిడేట్ కావాలని ఏమీ లేదు కాబట్టి పీసీసీ పదవి ఒకరికి, సీడబ్లూసీ సభ్యుడిగా లేదా క్యాంపెయిన్ కమిటీ ఛైర్మన్గా మరొకరికి అవకాశం ఇచ్చి ఇద్దరినీ పార్టీలో కీలకం చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఎవరికి ఏ పదవి ఇస్తుందనేది మాత్రం ఇంకా ఫైనల్ కాలేదు. ఇద్దరు నేతలూ కేసీ వేణుగోపాల్, మాణిక్యం ఠాకూర్, డీకే శివకుమార్ ద్వారా పీసీసీ అధ్యక్ష పదవి కోసం చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. సంక్రాంతి లోపే కొత్త అధ్యక్షుడి ఎంపిక ఉంటుంది.