హీరో అల్లు అర్జున్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. కరోనా వైరస్ నిబంధనలు ఉల్లంఘించారని, ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని అదిలాబాద్ జిల్లా నేరేడుగొండ పోలీసు స్టేషన్‌కు ఫిర్యాదు వచ్చింది. సమాచార హక్కు సాధన స్రవంతి అనే సంస్థకు చెందిన ప్రతినిధులు ఈ ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప సినిమా షూటింగ్ అదిలాబాద్ జిల్లా అడవుల్లో జరుగుతోంది. షూటింగ్ కోసమని వెళ్లిన అల్లు అర్జున్ కుంటాల జలపాతానికి వెళ్లారు.
అల్లు అర్జున్‌కు అటవీ శాఖ అధికారులు దగ్గరుండి కుంటాల జలపాతం అందాలను చూపిస్తూ, విశేషాలను వివరించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అయితే, అల్లు అర్జున్ రాక కారణంగా ఆ ప్రాంతంలో జనాలు గుమిగూడారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో ఇలా జనాలు గుమిగూడటం ప్రమాదకరం. నిజానికి, ఇప్పుడు కరోనా నిషేదాజ్ఞల వల్ల కుంటాల జలపాతం వద్ద సందర్శకులకు అనుమతి లేదు.
అనుమతి లేకపోయినా అల్లు అర్జున్ కుంటాల సందర్శించడం, అటవీశాఖ అధికారులే దగ్గరుండి ఆయనకు చూపించడం ఇప్పుడు వివాదమైంది. ఈ విషయమై కార్తీక్ అనే సమాచార హక్కు కార్యకర్త నేరేడుగొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తిప్పేశ్వర్ ప్రాంతంలో అనుమతులు లేకుండా పుష్ప సినిమా షూటింగ్ కూడా జరిగిందని, కాబట్టి అల్లు అర్జున్, సినిమా టీంపై కేసు నమోదు చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను కోరారు.