క్యూ న్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ పై హైకోర్టు న్యాయవాది అరుణ కుమారి డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేసారు. మంగళవారం డీజీపీ కార్యాలయంలో ఆమె తన ఫిర్యాదును అందించి అనంతరం మీడియా ప్రకటన చేసారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 139 మంది అత్యాచార బాధితురాలికి తన యుట్యూబ్ ఛానెల్ లో ఇంటర్వ్యూ చేసాడు.
ఆ సమయంలో బాధితురాలిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించిన తీరు సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని ఆమె మండిపడ్డారు. 139 మంది నిందితుల కోసం పోలీసులు 139 బుల్లెట్లు సిద్ధం చేసుకోవాలని సైకోలా మాట్లాడాడని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్భయ చట్టం నిబంధనలు పాటించకుండా అభ్యంతరకర విధంగా బాధితురాలిని ఇంటర్వ్యూ చేసాడని ఈ క్రమంలో హద్దులు ధాటి వ్యాఖ్యలు చేసాడని పేర్కొన్నారు.
అదే విధంగా గతేడాది జరిగిన దిశా ఎంకౌంటర్ బూటకమని అతను చేసిన వ్యాఖ్యలు దిశా చట్టాన్ని అగౌరవ పరిచే విధంగా ఉన్నాయని అన్నారు. సుప్రీం కోర్టునే కాకుండా నిర్భయ చట్ట నిబంధనలను అతిక్రమించి మహిళల విలువలనుదిగజార్చేలా ప్రవర్తించిన అతనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తూ న్యాయవాది అరుణ కుమారి ఫిర్యాదులో పేర్కొన్నారు.