ఆంధ్రపరదేశ్ రాష్ట్రంలో విశాఖ ఉక్కుపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ వంద శాతం ప్రైవేటీకరణ నిర్ణయంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై స్పందించారు. విశాఖ ఉక్కుపై ప్రధాని మోదికి ఆయన లేఖ రాశారు. ఈ లేఖలో పలు కీలక విషయాలను రాసుకొచ్చారు.
విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణమని అన్న జగన్ కేంద్రం ఈ సంస్థలో పెట్టుబడుల విషయమై పునః పరిశీలించాలన్నారు. ఉక్కు కర్మాగారాన్ని రక్షించుకోవడానికి కేంద్రంతో కలిసి పని చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ ప్లాంటు కోసం సుదీర్ఘకాలం పాటు పోరాటాలు జరిగాయని, 32 మంచి ప్రాణాలు వదిలారని తెలిపారు.
ప్రస్తుతం నష్టాల నుంచి ప్లాంట్ కోలుకుందని నెలకు రూ. 200 కోట్లకు పైగా లాభాలు వస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో అన్ని నష్టాలను అధిగమిస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రజల్లో ఆందోళనలకు కారణమైందన్నారు.
సొంత గనులు లేకపోవడం, వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయన్నారు. సొంత గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుందని.. అదే విధంగా రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదని కేంద్రానికి జగన్ సూచించారు. రాష్ట్రానికి ఆభరణంగా ఆన్న ఈ ప్లాంట్ ను కాపాడుకుంటామన్నారు.