దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్య శ్రీ పథకానికి సీఎం జగన్ విప్లవాత్మక మార్పులు చేశారు. అత్యవసర సేవలను మరింత విస్తృతం చేస్తూ ఒకేసారి ఏకంగా 1,088 అత్యవసర వైద్య సేవలు అందించే వాహనాలను ప్రవేశపెట్టారు. రాష్ట్రంలోని 95 శాతం మంది ప్రజలకు ఆరోగ్య భద్రతను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బుధవారం ఉదయం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖామంత్రి ఆళ్ల నాని, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ 104, 108 వైద్య సేవలు అందుతాయన్నారు. వీటిలో 412 అంబులెన్స్ లు అనారోగ్యానికి గురైన వారిని, ప్రమాదాలకు గురైన వారిని తక్షణమే ఆసుపత్రులకు చేరవేస్తాయన్నారు.
గతంలో సగటున ప్రతి 1,19,545 మందికి ఒక అంబులెన్స్ ఉండేది. ఇప్పుడు ప్రతి 74,609 మందికి ఒక అంబులెన్స్ అందుబాటులో ఉండనుంది. ఏదైనా ప్రమాదం సంభవిస్తే పట్టణ ప్రాంతాల్లో 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో గిరిజన ప్రాంతాల్లో 25 నిమిషాల్లో ఈ అంబులెన్సులు ప్రత్యక్షమవుతాయి. వీటి ద్వారా కుగ్రామాల్లో సైతం ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించనుంది ఏపీ ప్రభుత్వం.