పుదుచ్చేరిలో రాజకీయాలు అనూహ్య మలుపు తిరిగాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కసారిగా కుప్పకూలింది. బల నిరూపణలో విఫలమయ్యే అవకాశాలు అధికంగా ఉండటంతో నారాయణ స్వామి రాజీనామా లేఖతో రాజ్ భవన్ కు పయనమయ్యారు. నారాయణ స్వామి తీరుపై కొంతకాలంగా పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. పార్టీ పదవుల్లో సైతం తమకు అన్యాయం జరుగుతుందని ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదు చేసారు.
ఈ నేపథ్యంలో నెల రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. దీంతో పార్టీ బలం మెజారిటీ మార్కు దిగువకు చేరుకుంది. 2016 లో 30 స్థానాలకు నిర్వహించిన ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో గెలిచింది. డిఎంకేకు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే మద్దతుతో నారాయణస్వామి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ఇటీవల మంత్రి నమశ్శివాయమ్, ఎమ్మెల్యే తిప్పాయం దాన్, రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
తర్వాత మల్లాది కృష్ణారావు, జాన్ కుమార్ రాజీనామాలు చేశారు. ఇప్పుడు మరో ఇద్దరి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. తాజాగా రాజీనామాలతో కూటమి బలం 12 కు పడిపోయింది. మరోవైపు విపక్షాల బలం 14 గా ఉంది. ఈ నేపథ్యంలో నారాయణస్వామి బలం నిరూపించుకోవడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో బలపరీక్షకు ముందే నారాయణస్వామి రాజీనామా చేయనున్నారని ముందు నుంచే ప్రచారం సాగుతుంది.