తెలంగాణ రాష్ట్రంలో ఆర్థికంగా వెనకబడిన పేదల(ఈడబ్ల్యూఎ్స)కు సీఎం కేసీఆర్ శుభవార్త వినిపించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అగ్రవర్ణాలలోని పేదలకు 10 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అందుకు సంబందించిన ఉత్తర్వులు జారీ చేసింది. విద్య, ఉద్యోగ అవకాశాలలో వీటిని అమలు చేయబోతున్నారు.
కేంద్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని తెలంగాణలోనూ ప్రవేశపెడుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. వీటి అమలుతో రాష్ట్రంలో మొత్తం రిజర్వేషన్ల శాతం 60 కి చేరింది. ప్రస్తుతం రిజర్వేషన్లు పొందుతున్న వారికి యథావిధిగా వీటిని కొనసాగిస్తారు. అగ్రవర్ణాల పేదలకు విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేసింది.
అయితే రాష్ట్రాలు ఈ విధానంపై సొంత నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. ఇప్పటికే బీజేపీ పాలిత ప్రాంతాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించారు. కాగా రెండేళ్ల అనంతరం తెలంగాణలో సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అగ్రవర్ణాల పేదలకు సంబందించిన జనాభా 10 శాతంగా ఉన్నట్టుగా సమాచారం. కాగా ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వీరిలో దాదాపు 90 శాతం మంది లబ్ధి పొందనున్నారు.