సీఎం కేసీఆర్ కొన్ని రోజులుగా కీలక నిర్ణయాలను తీసుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన మరో సంచలనానికి తెర తీశారు. జిల్లా కలెక్టర్లకు అదనంగా కీలక బాధ్యతలను అప్పజెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా భూవివాదాలకు సంబందించిన అంశాలను ఇకపై వారే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసారు.
సాధారణంగా భూవివాదాలు సంబందించిన అధికారాలు రెవెన్యూ అధికారుల చేతిలో ఉండేవి. మరికొన్ని ఎమ్మెర్వో స్థాయి అధికారుల చేతిలో ఉండేవి. ఈ ప్రక్రియలో భారీగా అవినీతి జరుగుతుందన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది.
కలెక్టర్లకు భూవివాదాలు పరిష్కరించే బాధ్యతలు ఇవ్వడంతో పాటుగా రెండు నెలల వ్యవధిలోనే వివాదాలు పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. గురువారం ధరణి పోర్టల్ పై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో పలు కీలక విషయాలపై చర్చించారు. ఈ సందర్భంగా కేజీల కలెక్టర్లే వ్యవసాయ భూవివాదాలు పరిష్కరించేలా చూడాలన్నారు.
కోర్టు విచారణలో ఉన్నవి మినహా మిగిలిన వివాదాలను పరిష్కరించాలని అవసరమైతే వారే క్షేత్ర స్థాయిలో పర్యటించి భూ యజమానులకు న్యాయం చేయాలన్నారు. అందుకోసం కలెక్టర్ల ఆధ్వర్యంలో ఒక ట్రిబ్యూల్ ను ఏర్పాటు చేయాలన్నారు. సరిహద్దు వివాదాలుంటే కలెక్టర్లే సర్వే నిర్వహించి హద్దులు సూచించాలన్నారు.