తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రానికి ఏకంగా రూ. 5 వేల కోట్ల నష్టం వాటిల్లిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ఈరోజు ప్రగతి భవన్ లో భారీ వర్షాలు, వరదలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పడిన పరిస్థితులను ప్రధాని మోడీకి వివరిస్తూ సీఎం ఓ లేఖను రాశారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కారణంగా రూ. 5 వేల కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని అన్నారు.
తక్షణ సాయంగా రూ. 1350 కోట్లను వెంటనే రాష్ట్రానికి అందజేయాలని కోరారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం నాడు ప్రధాని మోడీ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఇక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వరద నష్టాలను సమగ్రంగా అంచనా వేయనున్నారు. ఈ సమావేశంలో మున్సిపల్, వ్యవసాయ, రోడ్లుభవనాలు, విద్యుత్ శాఖ మంత్రులు కె.టి.రామారావు, ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ నగరానికి చెందిన మంత్రులు మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ యాదవ్, జెన్ కో సిఎండి ప్రభాకర్ రావు, ఎస్ పిడిసిఎల్ సిఎండి రఘుమారెడ్డి, మున్సిపల్ వ్యవసాయ, ఆర్ అండ్ బి శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ ఎంసీ కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.