తెలంగాణ రాష్ట్రం వస్తే రాష్ట్రంలో కరెంటు రాదన్నారు. నీళ్లు ఉండవన్నారు. రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య పెరుగుతుందన్నారు. ఆ మాటలన్నిటినీ పటాపంచలు చేస్తూ తమ ప్రభుత్వం అభివృద్ధి పథంలో కొనసాగుతూ వచ్చిందన్నారు. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ గడ్డపై ఉన్న ప్రతి బిడ్డ తమవాడేనన్నారు. ఓటేసే ముందు ప్రజలంతా ఆలోచించుకోవాలన్నారు. నాయకుల పని తీరును బేరీజు వేసుకోవాలన్నారు. అప్పుడే సేవ చేసే రాజకీయ నాయకులు పుట్టుకొస్తారన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటం తరువాత తెలంగాణ సాధించుకున్నామన్నారు. ఓటర్లు ఎప్పుడు నాయకుడి విజన్ ను చూసి ఓటు వేయాలన్నారు.
పార్టీల అజెండాలపై చర్చించుకోవాలన్నారు. నగర వాసులకు, పేద ప్రజలకు కేసీఆర్ అందించిన కానుక ఉచిత తాగునీరని సీఎం వ్యాఖ్యానించారు. దేశంలో ఢిల్లీ తర్వాత ఒక్క హైదరాబాద్ లోనే ఉచిత మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు. 20 వేల లీటర్ల ఉచిత మంచి నీటి పథకాన్ని అపార్టుమెంటు వాసులకు కూడా వర్తింపజేయనున్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.