తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాల(ఈడబ్లూఎస్) వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఆయన నిర్ణయించారు. ఈ మేరకు ఆయన రెండ్రోజుల్లో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కూడా 10 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడంతో మొత్తం రిజర్వేషన్ల కోటా 60 శాతానికి చేరనుంది. నిజానికి కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లను ప్రారంభించింది.
ఆగ్రవర్ణాల్లోని పేదలకు ఈ రిజర్వేషన్లు అందుతాయి. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఇప్పటివరకు ఈ రిజర్వేషన్లు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవి అమలు కావడం లేదు. ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని రెండు రాష్ట్రాల్లో బీజేపీ, ఆగ్రవర్ణ పేదలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఈడబ్లూఎస్ రిజర్వేషన్లు ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించడంతో అగ్రవర్ణ పేదల్లో సంతోషం వ్యక్తం అయ్యే అవకాశం ఉంది. ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రిజర్వేషన్లపై ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.