ఏపీలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడుగు పెట్టిన నాటి నుంచి ఒక సమస్య ఇబ్బంది పెడుతుంది. అదే ఫేక్ న్యూస్. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై కొందరు పనిగట్టుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు తమపై వస్తున్న తప్పుడు వార్తలను కట్టడి చేసేందుకు జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
శుక్రవారం తాడేపల్లిలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో ఫ్యాక్ట్ చెక్ ఏపీ అనే వెబ్ సైట్, ట్విట్టర్ ఖాతాను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. మీడియా, సోషల్ మీడియాలో తమపై వస్తున్న తప్పుడు సమాచారానికి చెక్ పెట్టేందుకే ఈ వెబ్ సైట్. కొందరు దురుద్దేశ్య పూర్వకంగా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రభుత్వం ఈ వెబ్ సైట్ ద్వారా ఖండిస్తోంది.
ఆ వార్తలు ఎందుకు తప్పో ఆధారాలతో సహా చూపిస్తాం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలపై కావాలని తప్పుదోవ పట్టించేలా వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఒక వ్యక్తి, లేదా వ్యవస్థల ప్రతిష్టను దెబ్బతీసే హక్కు ఎవరికీ లేదు. ఈ వెబ్ సైట్ ద్వారా నిజమెంతో అబద్దమెంటో ఆధారాలతో సహా బయటపెడతామని ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యానించారు.