అప్పర్ పెన్నార్ ప్రాజెక్టుకు కృష్ణా జలాలను తరలించి కరువు ప్రాంతాలను ఆదుకుంటామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అనంతపురంలో కొత్తగా మూడు రిజర్వాయర్ల పనులకు జగన్ సర్కార్ శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో అనంతపురం మూడు రిజర్వాయర్ల నిర్మాణ పనులకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం శంకుస్థాపన చేసారు.
వర్చువల్ విధానం ద్వారా జరిగిన ఈ కార్యక్రమంలో పురపాలక శాఖా మంత్రి బొత్స సత్యనారాణయ, రోడ్లు, భవన నిర్మాణాల శాఖా మంత్రి మాలగుండ్ల శంకర నారాయణ, జిల్లా ఇంచార్జి మంత్రి, పశుసంవర్థక శాఖ మంత్రి అప్పలరాజుతో పాటుగా ఎంపీ గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
జీడిపల్లి రిజర్వాయర్ నీటి ఆధారంగా దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి, సోమరవాండ్లపల్లి రిజర్వాయర్లను నిర్మించడంతో ఏడు మండలాల్లోని 35 గ్రామాలకు మేలు జరుగుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 25 వేల ఎకరాలు సాగులోకి వస్తుందన్నారు. ఇందులో భాగంగా రూ.592 కోట్ల వ్యయంతో ఈ పనులు ప్రారంభించనున్నారు.
గత ప్రభుత్వాల హయాంలో ఈ పనుల కోసం జీవో ఇచ్చినా పనులు ప్రారంభించలేదు. ఈ నిర్మాణ పనులకోసం రూ.810 కోట్లు కేటాయించారు. అయినా పనులు జరగకపోగా వాటికి కేటాయించిన నిధులు దుర్వినియోగమయ్యాయన్నారు. ఈ ప్రాజెక్టుల ద్వారా లక్ష ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్నారు. అదనంగా 33 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని పెంచామన్నారు. ఒక ప్రాజెక్టు స్థానంలో మూడు ప్రాజెక్టులను నిర్మించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.250 కోట్ల మేర అదా అవ్వనుంది.