ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకస్మిక ఢిల్లీ టూర్ ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం జగన్ మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని మోదీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నట్టుగా సమాచారం అందుతుంది. ఈ భేటీలో భాగంగా ఏపీకి సంబందించిన పలు కీలక విషయాలపై చర్చ జరగనుంది.
ఏపీలో నెలకొన్న తాజా పరిస్థితుల దృష్ట్యా కేంద్ర మంత్రులతో జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీలో కొంత కాలంగా ఆలయాల విధ్వంసం ఘటనల వివాదం చెలరేగుతున్న విషయం తెలిసిందే. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రధానికి వివరించనున్నారు. విగ్రహాల ధ్వంసం ఘటనలో ప్రతిపక్షాల తీరును ప్రధానికి వివరించనున్నారు.
ప్రస్తుతం ఎక్కడ చూసినా జమిలి ఎన్నికలపైనే చర్చ జరుగుతుంది. కాగా జమిలి ఎన్నికల అంశంపై సీఎం జగన్ పూర్తి క్లారటీతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపటి భేటీలో జమిలి ఎన్నికలపై కూడా చర్చ ఉండబోతుందని సమాచారం. అదే విధంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల విషయమై కూడా చర్చిస్తారని తెలుస్తుంది. అయితే అంఈ భేటీకి సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.