టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేసారు. ఐదేళ్లపాటు ప్రతిపక్ష నేతగా ఉన్నా తాను ఏనాడూ స్పీకర్ పోడియం దగ్గరకు రాలేదన్నారు. మరి చంద్రబాబు ఎందుకు అలా రెచ్చిపోయారో అర్థం కావడం లేదన్నారు జగన్.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. సిబిఎన్ అంటే కరోనాకు భయపడే నాయుడు అంటూ జగన్ ఎద్దేవా చేసారు. వ్యవసాయ రంగంపై జరిగిన చర్చలో పంట నష్టం పై నిజాయతీగా సమీక్ష చేపట్టాలన్నారు. డిసెంబర్ 31 లోపు వరదల కారణంగా నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు. రంగుమారిన, మొలకెత్తిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.
అలాగే రైతులకు 80 శాతం సబ్సిడీ విత్తనాలు అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని జగన్ ప్రకటించారు. అక్టోబర్, నవంబర్ నెలలో ఇన్ ఫుట్ సబ్సిడీ ఇచ్చామని అలాగే నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన మత్స్యకారులను కూడా ఆదుకుంటామన్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షలమంది రైతులను రైతు భరోసా ద్వారా ఆదుకుంటున్నామన్నారు. వైఎస్సార్ జల కళ పథకం ద్వారా రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నామని సీఎం జగన్ పునరుద్ఘాటించారు.