ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలను చర్చించారు. సమావేశం అనంతరం మంత్రులతో సీఎం జగన్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పిటీసి ఎన్నికలపై జగన్ దిశానిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం కోటలు బద్దలు కొట్టారంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ప్రశంసలు కురిపించారు. ఎన్నడూలేని విధంగా 80 శాతం స్థానాలను దక్కించుకున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లోలాగానే రానున్న ఎన్నికల్లో కూడా కృషి చేయాలన్నారు.
కుప్పం నియోజకవర్గంలో 89 గ్రామ పంచాయతీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ 14 స్థానాలకు కైవసం చేసుకోగా.. 74 స్థానాల్లో వైసీపీ మద్దతుదారులు ఘనవిజయాన్ని సాధించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గమైన కుప్పంలో 1989 నుంచి అక్కడ టీడీపీకి పార్టీకి తిరుగు లేదు. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలోని పంచాయతీ స్థానాలపై వైసీపీ కన్నేసింది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మంత్రి పెద్దిరెడ్డి పక్కా వ్యూహంతో అత్యధిక స్థానాలను దక్కించుకోవడంలో విజయం సాధించారు.