అయోధ్యలో నిర్మించనున్న రామ మందిర నిర్మాణానికి విరాళాలు వెల్లువెతుతున్నాయి. ఒక్క హిందూ మతస్థులే కాకుండా అన్ని మతాల ప్రజలు బేధభావాలు లేకుండా రామ మందిర నిర్మాణానికి ముందుకొచ్చి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా మందిర నిర్మాణం కోసం కర్ణాటక రాష్ట్రానికి చెందిన క్రైస్తవ కమిటీ భారీ విరాళాన్ని అందజేసింది. క్రెస్తవ సముదాయానికి చెందిన పారిశ్రామిక వేత్తలు, విద్యావంతులు కలిసి రామ మందిరం కోసం రూ. 1 కోటిని విరాళంగా అందజేశారు.
బెంగుళూరులో ఆదివారం ఉపముఖ్యమంత్రి డాక్టర్ సీఎం అశ్వత్థ నారాయణ్ ఏర్పాటు చేసిన సభలో క్రైస్తవ సమాజానికి చెందిన వీరు తమ వంతు విరాళాన్ని అందజేషున్నటుగా పేర్కొన్నారు. మరోవైపు ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఫైజాబాద్ కు చెందిన ముస్లిం కుటుంబం రామ్ భవన్ లో తమ వంతు సాయంగా విరాళాన్ని అందజేసింది.
ఈ సందర్భంగా ఆ కుటుంబం మాట్లాడుతూ.. తామంతా భిన్న మతాలకు చెందిన వారం కావచ్చు కానీ పరాయి వాళ్ళము కాదు అంతా ఒకే ప్రాంతానికి, దేశానికి చెందినవారం. మనమంతా హిందుస్థానీలం. కలిసి మెలిసి సోదరభావంతో ఉంటున్నామన్నారు. కాగా మందిర నిర్మాణానికి విరాళం ఇచ్చిన ఈ కుటుంబాన్ని రామ్ భవన్ నిర్వాహకులు సన్మానించారు.