సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం తమిళ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి. సినిమాల్లో తిరుగులేని హీరోగా ఉన్న రజనీ ఇప్పుడు రాజకీయాల్లోను సత్తా చాటుతారని ఆయన అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇప్పటికే ఆయన తన పార్టీ గుర్తుపై కసరత్తులు ప్రారంభించారు. దీంతో తమిళనాట రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఇదిలా ఉండగా డిసెంబర్ 12న తలైవా తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
రజనీ రాజకీయ పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించిన తర్వాత వస్తున్న తొలి పుట్టిన రోజు కావడంతో ఆయన అభిమానులు పెద్ద ఎత్తన సంబరాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకి సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి రజనీ పొలిటికల్ పార్టీపై స్పందించారు.
”ప్రియమైన మిత్రుడికి 70వ పుట్టినరోజు శుభాకాంక్షలు. జీవితంలో విజయాన్ని సాధించినట్టే రాజకీయాల్లోనూ విజయం సాధించు. నీ ప్రత్యేకమైన స్టైల్ లక్షలాది మంది హృదయాలను గెలుచుకుంది. ఇప్పుడు ప్రజాసేవలోనూ నీ ప్రత్యేకతను చాటుకుంటావని ఆశిస్తున్నా” అంటూ చిరంజీవి అభినందనలు తెలిపారు.