కరోనా వైరస్ మనందరి జీవితాలను ఎంతోకొంత ప్రభావితం చేసింది. చాలా మంది ఉద్యోగాలు పోయి రోడ్డున పడేలా చేసింది. కేవలం ఉద్యోగాలే కాదు వివిధ వృత్తుల్లో స్థిరపడిన వారు కూడా కరోనా వైరస్ ప్రభావంతో పనులు లేక ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి ఎలాగోలా జీవితాన్ని నెట్టుకొస్తున్నారు. ఇలానే ఓ ప్రముఖ సీరియల్ డైరెక్టర్ కరోనా ప్రభావంతో పనులు లేక కూరగాయలు అమ్ముకుంటున్నారు.
తెలుగు టీవీ ప్రేక్షకులకు బాగా తెలిసిన సీరియల్ చిన్నారి పెళ్లికూతురు. హిందీలో బాలిక వధూ పేరుతో ఈ సీరియల్ ప్రసారమైంది. రెండు భాషల్లోనూ అత్యంత ప్రజాదరణ పొందింది ఈ సీరియల్. ఈ సీరియల్ సూపర్ సక్సెస్ కావడంతో డైరెక్టర్ రామ్ వృక్ష్ గౌర్తో పాటు ఇందులో నటించిన వారికి కూడా మంచి పేరొచ్చింది. ఈ సీరియల్ చిన్నారిగా నటించిన అవికా గౌర్ తర్వాత హీరోయిన్గా కూడా మారి తెలుగులో పలు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే.
బాలిక వధూ సీరియల్ తర్వాత డైరెక్టర్ రామ్ వృక్ష్ గౌర్‌కు పలు సీరియళ్లు తీసే ఛాన్సులు రావడంతో ఆయన ఇండస్ట్రీలో సెట్ అయిపోయారు. అయితే సినిమాలకు దర్శకత్వం వహించాలనేది ఆయన కల. దీంతో కొంతకాలంగా సీరియళ్లను పక్కనపెట్టి సినిమాల కోసం ప్రయత్నిస్తున్నారు. రామ్ వృక్ష్తో సినిమా తీయడానికి ఒక నిర్మాత ముందుకొచ్చారు. ఈ సినిమా పనుల్లో బిజీగా ఉండగానే కరోనా ప్రభావం మొదలై లాక్డౌన్ వచ్చింది.
దీంతో సినిమా పనులను ఆపేసింది నిర్మాణ సంస్థ. వచ్చే ఏడాది వరకు సినిమా గురించి ఆలోచించొద్దని రామ్ వృక్ష్కు తేల్చి చెప్పింది. పని కోల్పోవడంతో రామ్‌వృక్ష్ సొంతూరు ఉత్తరప్రదేశ్‌లోని అజామ్గఢ్కు చేరుకున్నాడు. దీంతో ఆయనకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. ఒకవైపేమో తాను తీసే సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేనందున ముంబై వెళ్లే పరిస్థితి లేదు. దీంతో సొంతూరులోనే ఏదైనా చేసుకొని జీవించాలనే నిర్ణయానికి వచ్చారు.
తన తండ్రిది కూరగాయల వ్యాపారం. తాను కూడా చిన్నప్పుడు కూరగాయలు అమ్మారు. దీంతో తనకు తెలిసిన వ్యాపారాన్నే మొదలుపెట్టారు. ఇంటింటికీ తిరుగుతూ కూరగాయలు అమ్ముతున్నారు. ఒకప్పుడు డైరెక్టర్‌గా ఎదిగి తమ ప్రాంతంలో సెలబ్రిటీగా మారిన రామ్ వృక్ష్ గౌర్ ఇప్పుడు తమ ఇళ్ల ముందుకు వచ్చి కూరగాయలు అమ్ముతుంటే స్థానికులు ఆశర్చపోతున్నారు. కానీ, తాను చేస్తున్న పని పట్ల రామ్ వృక్ష్ సంతృప్తిగానే ఉన్నారు.
నిజానికి రామ్ వృక్ష్ చాలా కష్టపడి ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. తన స్నేహితుడైన సినీ రచయిత షనావాజ్ ఖాన్‌తో కలిసి 2002లో ముంబై వెళ్లి సినిమా షూటింగ్లలో లైట్ బాయ్‌గా పని చేశారు. తర్వాత కొన్నిబాలీవుడ్ సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసే అవకాశం వచ్చింది. బాలిక వధూ సీరియల్ డైరెక్టర్‌గా పని చేశారు. ఇప్పుడు ఓ హిందీ, భోజ్‌పురి సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది కానీ కరోనా వల్ల ఆయన జీవితం మళ్లీ 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోయింది.