చైనాకు కుట్రలు తారస్థాయికి చేరాయి. భారత భూభాగంపై కన్నేసి సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న ఆ దేశం అన్ని రకాలుగా భారత్‌పై కుట్రలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో 10 వేల మంది భారతీయ ప్రముఖులు, సంస్థలపై చైనా నిఘా పెట్టిందనే సంచలన వార్తను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ వార్తపత్రిక బయటపెట్టింది. ఈ జాబితాలో అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు ఉన్నారు.
బిగ్ డేటా టెక్నాలజీని ఉపయోగించుకొని భారతీయులపై చైనా నిఘా పెట్టిందని తెలుస్తోంది. చైనాలోని షెన్జెన్ కేంద్రంగా పని చేసే జెన్జువా డేటా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ పని చేస్తోందని చెబుతున్నారు. ఈ సంస్థకు చైనా ప్రభుత్వం, చైనా కమ్యూనిస్టు పార్టీతో సంబంధాలు ఉన్నాయి. భారత్‌కు చెందిన వివిధ రంగాల ప్రముఖులపై ఈ సంస్థ నిఘా పెట్టి వివరాలను చైనా ప్రభుత్వానికి చేరుస్తోందని తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవిండ్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, వారి కుటుంబాలు, ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, అశోక్ గెహ్లాట్, అమరిందర్ సింగ్, ఉద్ధవ్ ఠాక్రే, నవీన్ పట్నాయక్, శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, రవిశంకర్ ప్రసాద్, నిర్మలా సీతారామన్, స్మ్రితి ఇరానీ, పియూష్ గోయల్, ఆర్మీ చీఫ్ బిపిన్ సింగ్ రావత్‌తో పాటు త్రివిధ దళాలకు చెందిన ముఖ్యులు, సుప్రీం కోర్టు చీఫ్ జస్టీస్ శరద్ బాబ్డే వంటి వారిపై చైనా నిఘా పెట్టిందని ఈ పత్రిక తెలిపింది.