ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయాలపై తాజాగా వెలువడిన ఓ సర్వేలో అనేక ఆసక్తికర అంశాలు కనిపిస్తున్నాయి. వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాదిన్నర గడుస్తున్న నేపథ్యంలో వీడీపీ అసోసియేట్స్ అనే సంస్థ సర్వే జరిపింది. ఈ సంస్థకు క్రెడిబులిటీ ఉండటం, గతంలో వీళ్లు చేసిన సర్వేలు చాలా వరకు నిజం కావడంతో ఇప్పుడు చేసిన సర్వే పైన కూడా ఆసక్తికర చర్చ మొదలైంది.
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్కు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరు అనే ఒక ప్రశ్న చాలా రోజులుగా రాష్ట్రంలో సాగుతోంది. గత ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీ కేవలం 23 సీట్లతో దారుణ ఓటమి ఎదుర్కోవడంతో చంద్రబాబు మళ్లీ పుంజుకోగలరా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే అనుమానంతో చాలా మంది టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి వైసీపీ, బీజేపీలో చేరుతున్నారు.
మరోవైపు తెలుగుదేశం పార్టీ స్థానంలోకి రావాలని బీజేపీ – జనసేన కూటమి తహతహలాడుతోంది. జగన్ కూడా టీడీపీని దెబ్బ మీద దెబ్బ కొట్టి బలహీనం చేయాలని, కోలుకోకుండా తొక్కేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదవుతున్నాయి. టీడీపీ నేతలు, క్యాడర్లో నిస్తేజం అలుముకుంది. దీంతో టీడీపీ పని ఇక అయిపోయిందా అనే ప్రశ్న మొదలైంది.
కానీ, ఈ ప్రశ్నకు వీడీపీ అసోసియేట్స్ సర్వే స్పష్టమైన సమాధానం ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఎంత తొక్కాలని ప్రయత్నం చేసినా, బీజేపీ – జనసేన ఎన్ని వ్యూహాలు రచించినా తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని దెబ్బ తీయలేరని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 40.6 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే చెబుతోంది. గత ఎన్నికల్లో టీడీపీకి 39.17 శాతం ఓట్లు వచ్చాయి. అంటే, సుమారు ఒక శాతం ఓట్లు పెరుగుతాయి అని సర్వేలో తేలింది.
ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని ఈ సర్వేలో అడిగిన ప్రశ్నకు 40.60 శాతం మంది చంద్రబాబు నాయుడు వైపు మొగ్గు చూపారు. అంటే, అధికార పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏడాదిన్నరలో తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకు, చంద్రబాబు నాయుడు పట్ల ప్రజల ఆదరణ తగ్గలేదు. పైగా ఒక శాతం పెరిగింది. అంటే, ఇప్పటికీ రాష్ట్రంలో టీడీపీ బలంగా ఉంది. వైసీపీకి టీడీపీనే ప్రత్యామ్నాయంగా ఉందనేది ఈ సర్వేలో తేలింది. బీజేపీ – జనసేన గత ఎన్నికలతో పోల్చితే ఏమంత పుంజుకోలేదని సర్వే చెబుతోంది.
తెలుగుదేశం పార్టీ స్థిరంగా గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లను కాపాడుకుంటుందని ఈ సర్వేలో తేలింది. కానీ, అధికారంలోకి వచ్చేంత మాత్రం పుంజుకోలేదు. ఇదే సమయంలో ఏడాదిన్నర పాలన తర్వాత వైసీపీకి 3 శాతం ఓట్లు పెరుగుతున్నాయని, జగన్ పట్ల 53 శాతం ప్రజల్లో ఆదరణ ఉందని కూడా ఇదే సర్వే చెబుతోంది. మొత్తంగా చూస్తే ఇప్పటికిప్పుడు జగన్ బలంగా ఉన్నారు. కానీ, టీడీపీ మాత్రం బలహీనపడలేదు. అవకాశం దక్కితే ఫీనిక్స్ పక్షి లాగా మళ్లీ ఎదిగే అవకాశాలు టీడీపీకి ఉన్నట్లు కనిపిస్తోంది.