టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన వ్యూహం మార్చుకున్నారా? ఇన్నాళ్లు ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసిన ఆయన ఇప్పుడు తాజాగా ఎన్నికల కమిషనర్ ను టార్గెట్ చేయడం చూస్తుంటే ఇవే అనుమానాలు తలెత్తుతున్నాయి. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్ విఫలైమైందంటూ చంద్రబాబు సంచలన ఆరోపణలు చేశారు.
ఎస్ఈసీ తన అధికారాలను పూర్తిగా ఉపయోగించలేదని ఆ కారణంగానే తాము కోర్టుకు వెళ్ళవలసి వచ్చిందన్నారు. తమ ఫిర్యాదులను పరిష్కరించడంలో కూడా ఎన్నికల కమిషన్ విఫలమైందంటూ చంద్రబాబు మండిపడ్డారు. అధికార పార్టీకి నిమ్మగడ్డ భయపడుతున్నారన్నారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ టీడీపీ దారిలోనే వెళ్తారని, చంద్రబాబుతో చేతులు కలిపారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇపుడు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆ ఆరోపణలను తిప్పికొట్టడానికేనా? లేక రాజకీయ వ్యూహంలో భాగంగానా? అనే విషయం సస్పెన్స్ గా మారింది.