తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు బీజేపీతో మళ్లీ స్నేహం చేయాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఏడాదిన్నరగా ఒక్కసారి కూడా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనలేదు. కేంద్రం తీసుకువచ్చే ప్రతి బిల్లుకు అడగకపోయినా టీడీపీ మద్దతు ఇస్తోంది. అవకాశం దొరికినప్పుడల్లా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై, కేంద్ర ప్రభుత్వంపై చంద్రబాబు నాయుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
గత ఎన్నికల్లో ఓడిన మరుక్షణమే తమ ఓటమికి బీజేపీకి దూరమవడం ప్రధాన కారణమని చంద్రబాబు గ్రహించారు. అందుకే అప్పటినుంచి బీజేపీకి మళ్లీ దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, బీజేపీ మాత్రం చంద్రబాబుతో మళ్లీ దోస్తీకి సిద్ధపడటం లేదు. టీడీపీతో కలిసి పోరాడేందుకు కూడా రాష్ట్ర బీజేపీ ఇష్టంగా లేదు. అయినా, కూడా పట్టువదలకుండా బీజేపీతో దోస్తీకి అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు చంద్రబాబు నాయుడు.
తాజాగా, ఆయన బీజేపీతో స్నేహం కోసం ఓ త్యాగానికి సైతం సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇటీవల తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ మరణించారు. దీంతో తిరుపతి స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి టీడీపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి పోటీ చేయగా ఆమెపై బల్లి దుర్గాప్రసాదరావు 2 లక్షలకు పైగా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇప్పుడు వైసీపీ తరపున బల్లి దుర్గాప్రసాద్ కుమారుడు కార్తీక్ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ తరపున మరోసారి పనబాక లక్ష్మీ పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఆమె అభ్యర్థిత్వాన్ని టీడీపీ ఖరారు చేసిందనే వార్తలు కూడా వచ్చాయి. తిరుపతి ఉప ఎన్నికకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అయితే, బయటకు ఇలా చెబుతున్నా తిరుపతిలో పోటీ చేయడానికి చంద్రబాబు అంత సుముఖంగా లేరనే ప్రచారం జరుగుతోంది. ఇందుకోసం ఆయన మదిలో పెద్ద వ్యూహమే ఉందని తెలుస్తోంది.
బీజేపీతో దోస్తీ కోసం చంద్రబాబు ఇప్పటికే ప్రయత్నిస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ – జనసేన కలిసి పోటీ చేయడం ఖాయమైంది. ఇక్కడ టీడీపీ తరపున అభ్యర్థిని పెట్టకుండా బీజేపీకి మద్దతు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. తద్వారా మళ్లీ బీజేపీతో కలవొచ్చనేది ఆయన ఆలోచన. అయితే, టీడీపీ మద్దతు బీజేపీ కోరితేనే ఇది సాధ్యమవుతుంది. కానీ, తమకు మద్దతు ఇవ్వమని టీడీపీని బీజేపీ కోరే అవకాశాలు లేవు.
ఇలా జరిగినప్పుడు అల్టర్నేట్ ప్లాన్ కూడా చంద్రబాబు దగ్గర ఉందట. బల్లి దుర్గాప్రసాద్ టీడీపీ తరపున నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. ఆయన పట్ల సానుభూతితో పాటు ఆయన కుటుంబసభ్యులు నిలబడుతున్నందున పోటీ చేయబోమని చంద్రబాబు ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలా పోటీకి దూరంగా ఉండి పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ పార్టీని మచ్చిక చేసుకోవాలని ఆయన భావిస్తున్నారంట.
తిరుపతి ఉప ఎన్నికలో గెలవడం అంత సులువు కాదని టీడీపీకి బాగా తెలుసు. అందుకే, ఇక్కడ పోటీ చేయడం కంటే చేయకపోవమే మంచిదనేది ఆ పార్టీ భావన. కాబట్టి, బీజేపీకి మద్దతు ఇవ్వడం ద్వారా ఆ పార్టీతో అయినా మళ్లీ సంబంధాలు పునరుద్దరించుకోవచ్చని చంద్రబాబు స్కెచ్ వేస్తున్నారని చెబుతున్నారు. మరి, తిరుపతి ఎంపీ సీటును చంద్రబాబు బీజేపీతో దోస్తీ కోసం త్యాగం చేస్తున్నారని చెప్పాలి. చంద్రబాబు త్యాగాన్ని బీజేపీ గుర్తిస్తుందో, లేదో చూడాలి.