అన్యమతస్థులు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదంటూ టీటీడీ బోర్డు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమని, సమాజానికే అరిష్ఠమని, అది ఆధ్యాత్మిక ద్రోహమని ఆయన పేర్కొన్నారు. మన సంస్కృతికి మూలం సనాతన ధర్మమనని, అలాంటి ధర్మ, సంప్రదాయాలు పాలకులు మారినప్పుడల్లా మారవని అన్నారు.
సనాతనం అంటే ప్రాచీనమైన, నిత్యమైన, ఏ నాటికీ మారని శాశ్వత ధర్మమని, ఇలా మార్చాలనుకోవడం ప్రజల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆరోపించారు. అసలు మతం అంటేనే నమ్మకమని, ఎవరైనా సరే స్వామిపై నమ్మకంతో రావడం కోసమే తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్యమతస్థులు డిక్లరేషన్లు ఇచ్చే సంప్రదాయాన్ని పెట్టారని పేర్కొన్నారు.
ఒక నమ్మకం లేని వ్యక్తి కోసం అనాదిగా అనుసరిస్తున్న సంప్రదాయాన్ని మార్చడం అనాచారమని, సమాజానికే అరిష్ఠమని అన్నారు. అన్యమతస్థులు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ఇప్పటివరకు డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన ఉండేది. ఈ నిబంధనను తొలగించాలని, భక్తి, నమ్మకంతో ఏ మతస్థుడైన స్వామివారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని టీటీడీ భావిస్తోంది.